Telugu Global
National

బెంగళూరులో వర్ష బీభత్సం.. మహిళా టెకీ దుర్మరణం

అక్కడ లోతు తెలియక విహార యాత్రకు వచ్చినవారు కారు ముందుకు పోనిచ్చారు. కారులో చిక్కుకుని ఊపిరాడక భానురేఖ మరణించారు.

బెంగళూరులో వర్ష బీభత్సం.. మహిళా టెకీ దుర్మరణం
X

బెంగళూరులో అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. వడగండ్ల వానతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో బయటకు వచ్చినవారు ఇళ్లకు చేరేందుకు అవస్థలు పడ్డారు. పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి, ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కార్లు, బైక్ లు వర్షపు నీటిలో మునిగిపోయాయి.

విహారయాత్రకు వెళ్లి..

బెంగళూరు వర్షాలకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి భానురేఖ దుర్మరణంపాలయ్యారు. వర్షపు నీటిలో కారు చిక్కుకోగా.. ఊపిరాడక ఆమె మృతిచెందారు. భానురేఖతోపాటు మరికొందరు ఏపీలోని వివిధ ప్రాంతాలనుంచి బెంగళూరు విహార యాత్రకు వెళ్లారు. వారాంతం కావడంతో షాపింగ్ చేస్తూ కాలం గడిపారు. వర్షం మొదలు కావడంతో కారు తీసుకుని బయలుదేరారు. కారు కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్దకు చేరుకుంది. అండర్ పాస్ లోకి నీరు చేరితే స్థానికులెవరూ ముందుకెళ్లే సాహసం చేయరు. కానీ అక్కడ లోతు తెలియక విహార యాత్రకు వచ్చినవారు కారు ముందుకు పోనిచ్చారు. కారులో చిక్కుకుని ఊపిరాడక భానురేఖ మరణించారు. మిగతావారిని ఆస్పత్రికి తరలించారు. వారంతా ఏపీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా గుర్తించారు.


సీఎం సిద్ధరామయ్య అత్యవసర భేటీ..

అకాల వర్షాల సమయంలో సహాయక చర్యలపై కర్నాటక నూతన సీఎం సిద్ధరామయ్య, అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అత్యవసర ప్రతిస్పందన దళాలను రంగంలోకి దించాలని సూచించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి బానురేఖ మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య.



First Published:  21 May 2023 2:48 PM GMT
Next Story