Telugu Global
National

కాంగ్రెస్ కి సినిమా కష్టాలు.. ట్విట్టర్ ఖాతాలు నిలిపివేయాలని కోర్టు ఆదేశం

కేజీఎఫ్ సినిమా మ్యూజిక్ రైట్స్ ఉన్న ఎంఆర్టీ అనే సంస్థ ప్రతినిధులు.. రాహుల్ గాంధీ, జైరాం రమేష్, సుప్రియపై చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన బెంగళూరు కోర్టు కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది.

కాంగ్రెస్ కి సినిమా కష్టాలు.. ట్విట్టర్ ఖాతాలు నిలిపివేయాలని కోర్టు ఆదేశం
X

భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి చిన్నపాటి షాకిచ్చింది బెంగళూరు కోర్టు. కాంగ్రెస్ పార్టీ, భారత్ జోడో యాత్ర అధికారిక ట్విట్టర్ ఖాతాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ఇకపై ఆ రెండు ట్విట్టర్ అకౌంట్లనుంచి కొత్త ట్వీట్లు వేయకూడదని చెప్పింది. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో గందరగోళం నెలకొంది. సోషల్ మీడియా అధికారిక ఖాతాలను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలివ్వడం పార్టీ శ్రేణులకు నిరాశ కలిగించే వార్తే.

అసలేం జరిగింది..?

కేజీఎఫ్ సినిమాలో పాట బాగుందని రాహుల్ గాంధీకి మంచి హైప్ ఇచ్చేందుకు ఆ పాటని భారత్ జోడో యాత్ర వీడియోలకు మిక్స్ చేసి ఉపయోగించారు కొంతమంది అభిమానులు. ఆ వీడియోకి మంచి స్పందన రావడంతో నేరుగా కాంగ్రెస్ కూడా దాన్ని వాడుకుంది. భారత్ జోడో యాత్ర అధికారిక ట్విట్టర్ ఖాతా, కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలనుంచి ఆ వీడియోని పబ్లిష్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆ వీడియోపై క్రేజ్ పెరిగింది. అయితే అక్కడే కేజీఎఫ్ టీమ్ రంగంలోకి దిగింది. తమ సినిమా పాటను రాహుల్ గాంధీ యాత్రలో ఎలా ఉపయోగించుకుంటారంటూ నేరుగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఆ సినిమా మ్యూజిక్ రైట్స్ ఉన్న ఎంఆర్టీ అనే సంస్థ ప్రతినిధులు.. రాహుల్ గాంధీ, జైరాం రమేష్, సుప్రియపై చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన బెంగళూరు కోర్టు కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. అయితే ఆ ఆదేశాలు తమకు నేరుగా అందలేదని, కోర్టు ప్రొసీడింగ్స్ పరిశీలించిన తర్వాతే ఈ విషయంపై స్పందిస్తామని తెలిపింది కాంగ్రెస్ పార్టీ. ఈ వివాదంపై అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. కోర్టు కార్యకలాపాల గురించి తమకు తెలియదని, ఆర్డర్ కాపీ తమ వద్ద లేదని చెప్పింది. బెంగళూరు కోర్టు ప్రతికూల ఆర్డర్ గురించి తాము సోషల్ మీడియాలో మాత్రమే చదివామని కాంగ్రెస్ స్పందించింది.

First Published:  8 Nov 2022 3:34 AM GMT
Next Story