Telugu Global
National

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై 5 ఏళ్ళు నిషేధం

'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా'ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నారనే ఆరోపణలపై ఈ సంస్థతో సహా దీని అనుబంద సంస్థలపై ప్రభుత్వం 5 ఏళ్ళ పాటు నిషేధం విధించింది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై 5 ఏళ్ళు నిషేధం
X

కేంద్ర ప్రభుత్వం బుధవారం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) తో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిపింది. ఎన్ ఐఎ దేశ‌వ్యాప్తంగా నిన్న 8 రాష్ట్రాల్లో రెండోసారి సోదాలు చేసి, ఈ సంస్థ‌తో సంబంధం ఉన్న 170 మందిని అరెస్టు చేసిన మరుస‌టి రోజే కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నారనే ఆరోపణలపై సెప్టెంబరు 22న, ఎన్ఐఏ నేతృత్వంలోని వివిధ బృందాలు 15 రాష్ట్రాలలో 106 మంది పిఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. పీఎఫ్‌ఐకి సంబంధించిన 19 కేసులను ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది.

"పిఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు బహిరంగంగా సామాజిక-ఆర్థిక, విద్యా, రాజకీయ సంస్థలుగా పనిచేస్తాయి. అయితే, వారు ప్రజాస్వామ్య భావనను ప‌క్క‌దోవ ప‌ట్టిస్తూ సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని ఉగ్ర‌వాదం వైపు మ‌రల్చ‌డానికి రహస్య ఎజెండాను అనుసరిస్తున్నారు. దేశ రాజ్యాంగాన్ని ధిక్క‌రిస్తూ, రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నారు" అని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ సంస్థలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, ఇవి దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంది. ఈ సంస్థ‌కు అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలు ఉన్నాయి. దేశంలో శాంతి. మత సామరస్యాల‌కు భంగం కలిగిస్తున్నాయని నోటిఫికేషన్ పేర్కొంది.

పిఎఫ్ ఐ ఆవిర్భావం..

కేరళ, తమిళనాడు, కర్నాటకకు చెందిన మూడు భావ సారూప్య సంస్థల నాయకుల‌కు 2006లో వ‌చ్చిన‌ ఆలోచ‌న‌ల ఫ‌లిత‌మే పిఎఫ్ఐ ఆవిర్భావం. ముస్లిం సమాజాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటు నుండి త‌ప్పించి సాధికారత సాధించేందుకు పాన్-ఇండియా సంస్థను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని చర్చించారు. కొద్ది రోజుల త‌ర్వాత కేరళలోని నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ (ఎన్‌డిఎఫ్), తమిళనాడులో మనిత నీతి పసరై, కర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ నాయ‌కులుబెంగళూరులో సమావేశమయ్యారు. ఈ మూడు సంస్థ‌లను విలీనం చేసి పిఎఫ్ఐ ని ఏర్పాటు చేశారు. ఆర్వాత ఈ సంస్థ సిమి, ఇండియ‌న్ ముజాహిద్దీన్ వంటి సంస్థ‌ల‌తో సంబంధాలు పెట్టుకుంద‌ని ఎన్ఐఎ చెబుతోంది.

పిఎఫ్ఐ ఇప్పుడు దాని రాజకీయ విభాగం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్ డిపిఐ), విద్యార్థి విభాగం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, రిహాబ్ ఇండియా ఫౌండేషన్ అనే స్వ‌చ్చంద సంప్థ‌, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ అనే థింక్ ట్యాంక్‌తో సహా వివిధ అనుబంధ సంస్థలను కలిగి ఉంది.

పిఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యులలో కొందరు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) నాయకులుగా ఉన్నారని, జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబి)తో పిఎఫ్ఐ నాయ‌కులకు సంబంధాలు ఉన్నాయ‌ని, ఈ రెండూ నిషేధిత సంస్థలేనని పేర్కొంది. ఐఎస్ఐఎస్ వంటి అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో పిఎఫ్ ఐకి సంబంధాలు ఉన్నాయ‌ని అనేక సంఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయ‌ని ఎన్ఐఎ తెలిపింది.

First Published:  28 Sep 2022 5:15 AM GMT
Next Story