Telugu Global
National

2023 జనవరి వరకు ఢిల్లీలో టపాకాయలపై నిషేధం..

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళికి కూడా టపాకాయల అమ్మకాలపై నిషేధం విధించిన ఆప్ సర్కారు, ఈ ఏడాది కూడా నిషేధాజ్ఞలు అమలులోకి తెచ్చింది.

2023 జనవరి వరకు ఢిల్లీలో టపాకాయలపై నిషేధం..
X

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళికి కూడా టపాకాయల అమ్మకాలపై నిషేధం విధించిన ఆప్ సర్కారు, ఈ ఏడాది కూడా నిషేధాజ్ఞలు అమలులోకి తెచ్చింది. సెప్టెంబర్ నుంచే క్రాకర్స్ అమ్మకాలను నిషేధించింది. ఈ నిషేధం 2023 జనవరి 1 వరకు ఉంటుందని స్పష్టం చేశారు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్. అంటే దీపావళితో పాటు.. వచ్చే ఏడాది కొత్త సంవత్సర వేడుకల్లో కూడా టపాకాయలు ఉండవన్నమాట. నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని, ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆన్‌లైన్‌లో అమ్మినా నేరమే...

ఢిల్లీలో టపాకాయలు అమ్మినా, కొన్నా నేరమే. తెలివిగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి ఇంటికి టపాకాయలు తెప్పించుకుని చాటుమాటుగా కాలుద్దామన్నా కుదరని పరిస్థితి. ఎందుకంటే ఆన్‌లైన్ అమ్మకాలపై కూడా ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అనుమానం ఉన్న పార్శిల్స్ ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు, తేడా వస్తే ఆయా డెలివరీ సంస్థలకు భారీ జరిమానా విధిస్తారు.

ప్రతి ఏడాదీ ఢిల్లీలో శీతాకాలం వాయు కాలుష్యం దారుణంగా ఉంటుంది. పంట వ్యర్థాలను తగలబెట్టడమే ప్రధాన కారణం అని అనుకుంటున్నా.. గతేడాది దాని ప్రభావం లేకపోయినా కాలుష్యం మాత్రం తగ్గలేదు. అయితే దీపావళి రోజున మాత్రం టపాకాయలు నిషేధించడంతో పండగ రోజుల్లో కాలుష్య తీవ్రత బాగా తగ్గినట్టు గమనించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో పొగమంచుతో ఢిల్లీ వాసులు అవస్థ పడతారు. వాయు కాలుష్యంతో ధూళి మేఘాలు చుట్టూ చేరతాయి. ఆరోగ్య సమస్యలున్నవారు మరింత ఇబ్బండి పడతారు.

పార్టీలు రెచ్చిపోతాయా..?

నిషేధాల కోసం హిందువుల పండగలే గుర్తొస్తాయా అంటూ కొంతమంది ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. గతంలో కూడా బీజేపీ అనుబంధ సంఘాలు దీపావళి టపాకాయల నిషేధంపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఆమ్ ఆద్మీ సర్కారు వెనక్కి తగ్గలేదు. నిషేధాన్ని కఠినంగా అమలు చేసింది. ఈ ఏడాది కూడా దీపావళి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని బాణసంచా మోత లేకుండా సైలెంట్ గా జరుపుకోవాల్సిందేనంటోంది ఢిల్లీ సర్కారు.

First Published:  7 Sep 2022 7:29 AM GMT
Next Story