Telugu Global
National

క్రిస్మస్, న్యూ ఇయర్ కి టపాకాయలపై నిషేధం..

బాణసంచా, స్కై లాంతర్లు, టాయ్ గన్స్.. వీటిపై మిజోరంలో 6వారాలపాటు నిషేధం విధించారు. ఈమేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. టపాకాయలు కాల్చడంతోపాటు అమ్మడం కూడా నేరమే.

క్రిస్మస్, న్యూ ఇయర్ కి టపాకాయలపై నిషేధం..
X

దీపావళికి బాణసంచా కాల్పులపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితం ఆ తర్వాత వారం రోజులపాటు ఢిల్లీలో స్కూళ్లు మూతబడ్డాయి, ఆఫీస్ లు మూతవేశారు, డీజిల్ వాహనాలకు ఢిల్లీలో అనుమతి లేదన్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ వాతావరణం కుదుటపడుతోంది. అయితే టపాకాయలపై ఇలాంటి నిషేధమే మిజోరం ప్రభుత్వం అమలులోకి తెస్తోంది. రాబోయే క్రిస్మస్ సహా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బాణసంచాపై ప్రభుత్వం నిషేధం అమలులోకి తెచ్చింది.

బాణసంచా, స్కై లాంతర్లు, టాయ్ గన్స్.. వీటిపై మిజోరంలో 6వారాలపాటు నిషేధం విధించారు. ఈమేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. టపాకాయలు కాల్చడమే కాదు, అమ్మడం కూడా మిజోరంలో నేరంగానే పరిగణిస్తామన్నారు. టపాకాయల అమ్మకాలు, కొనుగోళ్లపై నిఘా పెడుతున్నట్టు తెలిపారు ఐజ్వాల్ ఎస్పీ లూల్రుయీ.

కారణం ఏంటి..?

కాలుష్య నియంత్రణతోపాటు, కరోనా కేసుల విషయంలో కూడా మిజోరం ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గతంలో పండగల సందర్భంగా సమూహాలపై మిజోరంలో నిషేధం విధించారు. ఇప్పుడు సమూహాలుగా కలిసేందుకు అనుమతి ఇస్తున్నా.. టపాకాయలతో వాతావరణాన్ని కలుషితం చేస్తే, తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయని అనుమానిస్తోంది అక్కడి ప్రభుత్వం. నిపుణులు కూడా ఇదే సూచిస్తున్నారు. విచ్చలవిడిగా బాణసంచా కాల్చడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. అందుకే బాణసంచా నిషేధించాలంటున్నారు. అందరి సూచనలు పరిగణలోకి తీసుకున్న మిజోరం ప్రభుత్వం పండగ సీజన్లో బాణసంచాపై నిషేధం విధించింది. ఇది కేవలం క్రిస్మస్ కే కాకుండా, ఆ తర్వాత వచ్చే ఇతర మతాల పండగలకు కూడా వర్తిస్తుందని తెలిపారు అధికారులు.

First Published:  25 Nov 2022 1:23 PM GMT
Next Story