Telugu Global
National

సార్వత్రిక ఎన్నికల నాటికి అయోధ్య రామ మందిరం రెడీ..

అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని, ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. 2024 జనవరిలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గర్భగుడిలో విగ్రహాలను ప్రతిష్టిస్తారని చెప్పారు.

సార్వత్రిక ఎన్నికల నాటికి అయోధ్య రామ మందిరం రెడీ..
X

దేశంలో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకున్నా, రూపాయి నేల చూపులు చూస్తున్నా, నిత్యావసరాల రేట్లు పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నా.. ఎన్నికల నాటికి బీజేపీ ఏదో ఒక సాకుతో ఓట్లు అడిగేందుకు సిద్ధంగా ఉంటుందనే అంచనాలున్నాయి. అందులో ఒక అంశం ఇప్పుడు రెడీ అవుతోంది. అదే అయోధ్య రామ మందిరం. రామ మందిర నిర్మాణానికి, బీజేపీ ప్రభుత్వానికీ ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, వచ్చే ఎన్నికల నాటికి రామ మందిరాన్ని, రామబాణంలా చేసుకోవాలని బీజేపీ చూస్తోంది.

2024 జనవరి నుంచి దర్శనాలు..

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పనులు 50 శాతం పూర్తయ్యాయని, ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. 2024 జనవరిలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గర్భగుడిలో విగ్రహాలను ప్రతిష్టిస్తారని తెలిపారు. ఆ తర్వాత ఆలయంలోకి భక్తులకు ప్రవేశం కల్పిస్తారు. రామ మందిరం గ్రౌండ్‌ ఫ్లోర్‌ 2023 డిసెంబర్‌ నాటికి పూర్తవుతుందని, 2024 జనవరి 14న దేవతా మూర్తుల విగ్రహాలను ప్రతిష్టిస్తామని ప్రకటించారు.

నిర్మాణ పనుల తీరు పట్ల శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్రం సంతృప్తి వ్యక్తం చేసింది. పనులన్నీ అనుకున్న రీతిలో జరుగుతున్నాయని తెలిపింది. రామ మందిర నిర్మాణం మొదలైనప్పుడే.. సార్వత్రిక ఎన్నికల నాటికి దాన్ని పూర్తి చేస్తారనే ప్రచారం జరిగింది. సరిగ్గా ఇప్పుడు అదే నిజమనిపిస్తోంది. 2024 జనవరిలో మందిరం ప్రారంభమైతే.. ఆ తర్వాత అదే అజెండాతో బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టే అవకాశముంది. ఈలోగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. వాటి ఫలితాలు బేరీజు వేసుకుని చివరిగా బీజేపీ 2024 ఎన్నికల అజెండా ప్రకటించే అవకాశాలున్నాయి.

First Published:  26 Oct 2022 6:06 AM GMT
Next Story