Telugu Global
National

బైక్ ట్యాక్సీలు వద్దంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన..

ఆటోలను కాదని, చాలామంది బైక్ ట్యాక్సీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆటోలకు గిరాకీ తగ్గిపోయింది.

బైక్ ట్యాక్సీలు వద్దంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన..
X

ఓలా, ఉబెర్ వంటి కంపెనీలు రంగంలోకి దిగిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లాలి, ఎంతదూరం, ఎంత రేటు అనేది సెల్ ఫోన్ లోకి వచ్చేసింది. డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఆధారంగా అటు కంపెనీలు, ఇటు సొంత కారు, ఆటో ఉన్నవారు లాభపడ్డారు. వినియోగదారులకు కూడా ఈ బుకింగ్ విధానం సౌకర్యవంతంగా అనిపించింది. అయితే ఆ తర్వాత ఆయా కంపెనీలు బైక్ లను కూడా వదిలిపెట్టకపోవడంతో ఆటోవాలాల ఆదాయానికి గండి పడింది.

గతంలో బైక్ లపై వెళ్లేవారు ఎవరికైనా ఉచితంగా లిఫ్ట్ ఇచ్చేవారు. కానీ బైక్ ట్యాక్సీ అనే కొత్త ఆలోచన వచ్చాక అది కూడా కమర్షియల్ గా మారిపోయింది. నిరుద్యోగులు, చిరుద్యోగులు సైతం ఖాళీ సమయాల్లో బైక్ ట్యాక్సీ నడుపుతూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. అయితే ఇది ఆటోవాలాలకు ఇబ్బందిగా మారింది. ఆటోలను కాదని, చాలామంది బైక్ ట్యాక్సీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆటోలకు గిరాకీ తగ్గిపోయింది. గతంలో ఇదే విషయంపై పుణె సహా ఇతర ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు సమ్మె చేపట్టారు. నవంబర్ 28న పుణెలో నిరవధిక ఆందోళనకు దిగారు. తాజాగా మరోసారి పుణె ఆటో డ్రైవర్లు నిరసనకు దిగుతున్నారు. చక్కా జామ్ పేరుతో నిరసన చేపట్టాలని డ్రైవర్ల సంఘాలు తీర్మానించాయి.

నిషేధం.. లేదా నియంత్రణ..

బైక్ ట్యాక్సీ సేవలను తక్షణమే నిషేధించాలని, లేకపోతే వాటిపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో వాలాలు. ఈ సమస్య పరిష్కారానికి కమిటీ నియమించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చంద్రకాంత్ పాటిల్ గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చాలంటూ ఆటో రిక్షా కార్మికులు సమ్మె మొదలు పెట్టబోతున్నారు. బైక్ ట్యాక్సీలు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా ఇంకా తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈరోజు ఆర్టీఏ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. బైక్ ట్యాక్సీలపై నియంత్రణ విధించకపోతే సమ్మె ఉధృతం చేస్తామంటున్నారు.

First Published:  12 Dec 2022 7:10 AM GMT
Next Story