Telugu Global
National

కాపలా పెడితే.. ప్రభుత్వ ఆఫీసు వస్తువులన్నీ అమ్మేసిన అటెండర్

కొత్త భవనంలోకి మార్చే సమయంలో కొన్ని వస్తువులు, ఫైల్స్ అధికారులు తీసుకొని వెళ్లారు. కానీ అల్మారాలు, టేబుల్స్, కుర్చీలు, కొన్ని ఫైల్స్ పాత భవనంలోనే ఉండిపోయాయి. దీంతో ఆ భవనానికి కాపలాగా అదే కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే పీతాంబర్‌కు అప్పగించారు.

కాపలా పెడితే.. ప్రభుత్వ ఆఫీసు వస్తువులన్నీ అమ్మేసిన అటెండర్
X

ఓ ప్రభుత్వ ఆఫీసుకు కాపలా ఉండమని పెడితే.. అదను చూసుకొని అందులోని ఫర్నిచర్ మొత్తం అమ్మేశాడు. చివరకు ఫైల్స్, కిటికీలు, తలుపులు కూడా అమ్మేసి దర్జాగా ఎంజాయ్ చేశాడు. కాపలా ఉన్న వ్యక్తి బయటి వాడు కాదు. ఏకంగా ఆ ఆఫీసు అటెండర్. రెండేళ్ల తర్వాత తాపీగా ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా గంజాం జిల్లా బెరంపూర్ సిటీలోని భవనంలో 1948లో డీఐ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ కార్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయం (డీఈవో)గా మార్చారు. కాగా, రెండేళ్ల క్రితం డీఈవో కార్యాలయానికి కొత్త భవనం కట్టడంతో అక్కడికి షిఫ్ట్ అయ్యారు.

కొత్త భవనంలోకి మార్చే సమయంలో కొన్ని వస్తువులు, ఫైల్స్ అధికారులు తీసుకొని వెళ్లారు. కానీ అల్మారాలు, టేబుల్స్, కుర్చీలు, కొన్ని ఫైల్స్ పాత భవనంలోనే ఉండిపోయాయి. దీంతో ఆ భవనానికి కాపలాగా అదే కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే పీతాంబర్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఆ భవనానికి సంబంధించిన బాధ్యతలు అతడే చూస్తున్నాడు. అప్పుడప్పుడు ఇతడే వెళ్లి కొత్త భవనంలో అధికారులను కలిసేవాడు. కానీ ఏ ఒక్క అధికారి కూడా రెండేళ్లుగా పాత భవనం వైపు చూడలేదు.

కాగా, మద్యానికి బానిసైన పీతాంబర్ పాత ఆఫీసులోని ఒక్కో వస్తువు అమ్మేయడం ప్రారంభించాడు. కుర్చీలు, టేబుల్స్, అల్మారాలు, ఫైల్స్.. చివరకు కొన్ని కిటికీలు, తలుపులు కూడా అమ్మేసి మ‌ద్యం తాగేవాడు. రెండు రోజుల క్రితం డీఈవో కార్యాలయానికి చెందిన సెక్షన్ ఆఫీసర్ జయంత్ కుమార్ సాహు ఓ ఫైల్ కోసం పాత భవనానికి వచ్చారు. అక్కడ వెళ్లి పరిశీలించగా మొండి గోడలు తప్ప లోపల అసలు ఏమీ లేవు. వెంటనే ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసుల విచారణలో 35 అల్మారాలు, 10 జతల చైర్లు, ఫైల్స్, మిగిలిన ఫర్మీచర్ మొత్తం అమ్మేశానని ఒప్పుకున్నాడు. స్థానికంగా ఉన్న స్క్రాప్ డీలర్‌కు అమ్మేసినట్లు విచారణలో తేలింది. మద్యం కొనడానికే ఈ వస్తువులు అమ్మేశాడు. దీంతో పోలీసులు పీతాంబర్‌తో పాటు స్క్రాప్ డీలర్‌పైన కూడా కేసు పెట్టి అరెస్టు చేశారు. పీతాంబర్‌ను సస్పెండ్ చేసి శాఖ పరమైన విచారణకు ఆదేశించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బినితా సేనాపతి తెలిపారు.

First Published:  28 Sep 2022 2:06 AM GMT
Next Story