Telugu Global
National

దేశ చరిత్రను మార్చే ప్రయత్నాలను అడ్డుకోవాలి: మ‌మ‌తా బెన‌ర్జీ

స్వార్ధ రాజ‌కీయ శ‌క్తులు దేశ చ‌రిత్ర‌ను మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని ఆమె ప‌రోక్షంగా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చరిత్రను రక్షించేందుకుప్రయత్నిస్తోందని, రాజకీయ ఉద్దేశాలతో దేశ చరిత్రను,పేర్ల‌ను మారుస్తున్నార‌ని బిజెపి పై ముఖ్యమంత్రి ఆరోప‌ణ‌లు గుప్పించారు.

దేశ చరిత్రను మార్చే ప్రయత్నాలను అడ్డుకోవాలి: మ‌మ‌తా బెన‌ర్జీ
X

స్వార్ధ రాజ‌కీయాల కోసం దేశ ప్ర‌యోజ‌నాలను,చ‌రిత్ర‌ను ప‌ణంగా పెడుతున్న శ‌క్తుల‌ను అడ్డుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌శ్చిమ‌ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. ఈ శ‌క్తులు దేశ చ‌రిత్ర‌ను మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని ఆమె ప‌రోక్షంగా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌హా ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర త‌దిత‌ర ప్రాంతాల్లో పేర్ల మార్పులు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మ‌మ‌త ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు.

దేశ స్వాతంత్య్ర‌ పోరాటంలో బెంగాల్ ముఖ్యమైన పాత్ర పోషించింద‌ని అన్నారు. అలీపూర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లో మ్యూజియాన్ని ప్రారంభించిన అనంత‌రం ఆమె ప్ర‌సంగించారు. "దేశ స్వాతంత్య్ర‌ పోరాటంలో బెంగాల్ ముఖ్యమైన పాత్ర పోషించింది. బెంగాల్ నుండి అనేక మంది స్వాతంత్య్ర‌ సమరయోధులు స్వాతంత్య్ర‌ పోరాటంలో పునరుజ్జీవనాన్ని తీసుకువచ్చారు. ఇదొక మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది'' అని మమత అన్నారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చరిత్రను 'రక్షించేందుకు' ప్రయత్నిస్తోందని, రాజకీయ ఉద్దేశాలతో దేశ చరిత్రను,పేర్ల‌ను మారుస్తున్నార‌ని అన్యాప‌దేశంగా బిజెపి పై ముఖ్యమంత్రి ఆరోప‌ణ‌లు గుప్పించారు.

"భవిష్యత్ తరానికి నిజమైన చరిత్ర గురించి తెలియకుండా చరిత్ర మార్పు జ‌రుగుతోంది. ఇదంతా రాజకీయ ప్రేరేపితమే. అసెంబ్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు చెందిన ప్రతి పత్రాన్ని డిజిటలైజ్ చేసి ఉంచారు. మ్యూజియంలో స్వాతంత్య్ర‌ సమరయోధులను ఉంచిన సెల్‌ను కూడా పునరుద్ధరించారు. స్వాతంత్య్ర‌ సమరయోధులు ఉపయోగించిన వస్తువులను కూడా పునరుద్ధరించేందుకు ప్రయత్నించాం'' అని మమత పేర్కొన్నారు.

రాష్ట్రానికి చెందిన మహిళా స్వాతంత్య్ర‌ సమరయోధుల పట్ల ముఖ్యమంత్రి తన గౌరవాన్ని చాటుకున్నారు. కుల‌మ‌తాల‌క‌తీతంగా ప్రజలను ఆదుకునేవారే మంచి నాయకుల‌ని ముఖ్యమంత్రి అన్నారు. అయితే ఇటీవ‌ల ఈడి, సిబిఐ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌లు రాష్ట్ర టిఎంసి నాయ‌కుల‌పై దాడులు చేస్తూ కేసులు న‌మోదు చేస్తున్న నేపథ్యంలో ముఖ్య‌మంత్రి దూకుడు త‌గ్గించార‌నే వాద‌న విన‌బ‌డుతోంది. అందుకే ఆమె నేరుగా ఎక్క‌డా బిజేపి పేరును కానీ, ప్ర‌దాని పేరును కానీ ప్ర‌స్తావించి విమ‌ర్శ‌లు చేయ‌డంలేద‌ని అంటున్నారు.

First Published:  22 Sep 2022 10:38 AM GMT
Next Story