Telugu Global
National

బీజేపీ జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చబోతోందా? ... గ‌వ‌ర్న‌ర్ ర‌మేష్ వ్యాఖ్యల వెనక అర్దం ఏంటి ?

త్వరలో జార్ఖండ్ లో అణుబాంబు పేలబోతోంది అని ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ చేసిన వ్యాఖ్యలపై అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి. బీజేపీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేయబోతుందా అనే చర్చ ఊపందుకుంది.

బీజేపీ జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చబోతోందా? ... గ‌వ‌ర్న‌ర్ ర‌మేష్ వ్యాఖ్యల వెనక అర్దం ఏంటి ?
X

జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సోరేన్ ప్ర‌భుత్వం ఏ క్ష‌ణ‌మైనా ప్ర‌మాదంలో ప‌డ‌వ‌చ్చ‌నే సంకేతాలు ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు రుజువు చేస్తున్నాయంటున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా తన స్వస్థలమైన రాయ‌పూర్ వెళ్ళిన‌ప్పుడు ర‌మేష్ మాట్లాడుతూ జార్ఖండ్ లో ఏ క్ష‌ణ‌మైనా "ఆటం బాంబు" పేల‌వ‌చ్చని వ్యాఖ్యానించారు.

సోరేన్ ను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ప‌ద‌వినుంచి తొల‌గించాల‌ని బిజెపి డిమాండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దీనిపై గ‌వ‌ర్న‌ర్ ర‌మేష్ ఈసీ అభిప్రాయాన్ని కోరారు. ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ఆగస్టు 25 న జార్ఖండ్ గవర్నర్‌కు పంపింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ఇంకా బ‌య‌టికి అధికారికంగా వెలువడనప్పటికీ, మైనింగ్ లీజుకు సంబంధించి ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని పోల్ ప్యానెల్ సిఫారసు చేసిందనే ప్రచారం జరుగుతోంది.

ఇది రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఈనేపథ్యంలో ముఖ్య‌మంత్రి సోరేన్ అసెంబ్లీలో విశ్వాస‌ప‌రీక్ష ఎదుర్కొని భాభౄరీ మెజారిటీతో స‌భా విశ్వాసాన్ని పొందారు. ఈసీ పంపిన అభిప్రాయంపై గ‌వ‌ర్న‌ర్ ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోకుండా పెండింగ్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌లు కీల‌కంగా మారాయి. తాను సెకండ్ ఒపీనియ‌న్ కోరాన‌ని ఆయ‌న‌చెప్పారు.

జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తున్నారన్న సోరెన్ క్యాబినెట్ సహచరుల ఆరోప‌ణ‌ల‌పై కూడా ఆయ‌న స్పందించారు. " నా ఉద్దేశం అదే అయితే, ఎన్నికల సంఘం సిఫారసు ఆధారంగా నేను ఎప్పుడో నిర్ణయం తీసుకునేవాడిని. కానీ, నేను ఎవరి పరువు తీయడానికో లేదా ప్రతీకార ఉద్దేశంతోనో ఎలాంటి చర్య తీసుకోదలుచుకోలేదు. నేను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను. నేను రాజ్యాంగాన్ని రక్షించాలి. నేను ప్రతీకారంతో ప్రవర్తించాను అని ఎవరూ న‌న్ను వేలెత్తి చూపకూడదు. అందుకే నేను రెండవ అభిప్రాయం కోరాను" అని గవర్నర్ స్ప‌ష్టంగా చెప్పారు.

అయితే, ఎన్నికల కమిషన్ సిఫార్సుపై గానీ, ఆయ‌న ఎవరి నుండి రెండవ అభిప్రాయాన్ని కోరారో వివరించలేదు.

రెండో అభిప్రాయం వచ్చిన తర్వాత సంచ‌ల‌న‌ నిర్ణయం వెలువడుతుందా అని ప్రశ్నించిన‌ప్పుడు .. గవర్నర్ స్పందిస్తూ.., "... ఢిల్లీలో క్రాకర్లు పేల్చడం నిషేధించారు. కానీ జార్ఖండ్‌లో కాదు. బహుశా అక్కడ ఒక అణు బాంబు పేలవచ్చు. అంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌లు త్వ‌ర‌లో జార్ఖండ్ లో ఏదో సంచ‌ల‌నం జ‌ర‌గ‌వ‌చ్చ‌నే అనుమానాల‌ను క‌లిగిస్తున్నాయి.

First Published:  28 Oct 2022 11:25 AM GMT
Next Story