Telugu Global
National

నేడు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఓట్ల లెక్కింపు.. సర్వం సిద్ధం చేసిన ఈసీఐ

ఉదయం 9.00 గంటల నుంచి ట్రెండ్స్ బయటకు వస్తాయని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం కల్లా రెండు రాష్ట్రాల ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.

నేడు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఓట్ల లెక్కింపు.. సర్వం సిద్ధం చేసిన ఈసీఐ
X

మరి కొద్ది గంటల్లో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ముగిసిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు చేపడతారు. ఉదయం 9.00 గంటల నుంచి ట్రెండ్స్ బయటకు వస్తాయని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం కల్లా రెండు రాష్ట్రాల ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.

హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలు ఉన్నాయి. నవంబర్ 12న ఓకే దశలో ఆ రాష్ట్రంలో పోలింగ్ నిర్వహించారు. 74 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. పోలింగ్ పూర్తయిన దాదాపు నెల తర్వాత లెక్కింపు చేపట్టనుండటం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్‌లో గత 35 ఏళ్లుగా ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలవలేదు. గెలుపునకు 35 సీట్లు అవసరం. బీజేపీ, కాంగ్రెస్ పోటీపోటీగా నిలిచినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తున్నాయి. బీజేపీ మరోసారి గెలిస్తే.. వరుసగా రెండు సార్లు గెలిచిన పార్టీగా రికార్డు సృష్టించే అవకాశం ఉన్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఏ పార్టీ గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. రెండు పార్టీలు కూడా గెలుపుపై ధీమాగా ఉన్నాయి.

ఇక దేశమంతా గుజరాత్ ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 1న తొలి దశ, డిసెంబర్ 5న రెండో దశకు పోలింగ్ నిర్వహించారు. తొలి దశలో 63.3 శాతం, రెండో దశలో 64.65 శాతం పోలింగ్ నమోదయ్యింది. గుజరాత్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 92 సీట్లు అవసరం. కాగా, గత 27 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. ఈ సారి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. పశ్చిమ బెంగాల్‌లో వరుసగా గెలిచిన సీపీఎం పార్టీ రికార్డును బీజేపీ సమం చేస్తుంది.

గుజరాత్‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ గెలుస్తుందని అంచనా వేశాయి. పైగా గతంలో కంటే మరిన్ని సీట్లు వస్తాయని మెజార్టీ సర్వేల్లో తేలింది. గతంలో ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండేది. కానీ తాజాగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో సీన్ కాస్త మారింది. పంజాబ్‌లో అధికారం చేపట్టిన మాదిరిగానే.. గుజరాత్‌లో కూడా మ్యాజిక్ చేసి గెలుస్తామని ఆప్ ధీమా వ్యక్తం చేసింది. కానీ ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం ఆప్ ప్రభావం పెద్దగా ఉండదని తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా గట్టి పోటీ ఇవ్వలేనట్లు తెలుస్తున్నది. మొత్తానికి రికార్డు విజయం వైపు బీజేపీ వెళ్తుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

First Published:  8 Dec 2022 1:19 AM GMT
Next Story