Telugu Global
National

మణిపూర్‌లో మ‌ళ్లీ ఆయుధాల లూటీ

మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మృతిచెందిన కుకీల సామూహిక ఖననానికి వెళ్లేందుకు కొందరు కుకీలు ప్రయత్నించారు.

మణిపూర్‌లో మ‌ళ్లీ ఆయుధాల లూటీ
X

మణిపూర్‌లో తెగల పోరు, ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అల్లరిమూకలు అడ్డూ ఆపూ లేకుండా రెచ్చిపోతున్నాయి. తాజాగా మరోసారి దుండగులు పోలీసు ఆయుధాగారంపై దాడి చేశారు. ఎకే 47, ఘాతక్‌ వంటి అత్యాధునిక రైఫిల్స్, వివిధ రకాల తుపాకుల్లోని 19 వేలకు పైగా బుల్లెట్లు అపహరించారు.

మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మృతిచెందిన కుకీల సామూహిక ఖననానికి వెళ్లేందుకు కొందరు కుకీలు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న నేపథ్యంలో కుకీలు, ఆర్మీ బలగాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంత ప్రయత్నించినా కుకీలు వెనక్కి తగ్గకపోవడంతో ఆర్మీ, ఆర్‌ఏఎఫ్‌ బలగాలు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ను ప్రయోగించాయి. ఈ ఘటనలో సుమారు 25 మందికి గాయాలయ్యాయి. దీంతో, అంతిమ సంస్కార కార్యక్రమాలను కేంద్రం వినతి మేరకు వారం పాటు వాయిదా వేసుకున్నారు.



అటు సామూహిక ఖననాన్ని అడ్డుకునేందుకు చురాచాంద్‌పూర్‌ వైపు వందలాదిగా కదిలిన మైతీలు బిష్ణుపూర్‌ జిల్లా నరన్‌సెయినలోని రెండో భారత రిజర్వు బెటాలియన్‌ కేంద్ర కార్యాలయంపై అల్లరిమూక దాడి చేసి భారీగా ఆయుధాలను లూటీ చేశారు. ఏకే, ఘాతక్‌ రైఫిళ్లు, 195 సెల్ఫ్‌ లోడింగ్‌ రైఫిల్స్, ఐదు ఎంపీ–5 గన్స్, 16 9ఎంఎం పిస్టల్స్, 25 బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, 21 కార్బైన్స్, 124 హ్యాండ్‌ గ్రేనేడ్స్‌ను దొంగిలించినట్టుగా అధికారులు ప్రకటించారు. వీటితో భారీ దాడులకు తెగబడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు, ఆయుధాలు లూటీ చేసిన వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

మే 3న కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలు ప్రారంభమైన రోజు నుంచి మణిపూర్‌లో పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాలపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దుండగులు దాదాపు 4,000 ఆయుధాలు, తుపాకులను, దాదాపు 5 లక్షల తూటాలను దోచుకెళ్లారు. జూలై ముగిసేనాటికి వీటిలో కేవలం 1,000 తుపాకులను మాత్రమే పోలీసులు రికవరీ చేసుకోగలిగారు.

ఈ ఘర్షణల్లో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ గొడవల్లో ఇప్పటి వరకు 6 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. మొత్తం నమోదైన కేసుల్లో ఎక్కువగా ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడం, నాశనం చేయడం వంటివే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మహిళల ఊరేగింపు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో దేశం మొత్తం ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.

ప్రభుత్వం, భద్రతా బలగాలు మణిపూర్‌లోని అన్ని సంఘటనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సోషల్‌ మీడియా, ఇంటర్నెట్ లపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.

First Published:  5 Aug 2023 3:07 AM GMT
Next Story