Telugu Global
National

బాంగ్లాదేశ్ పీఎం భారత్ లో పర్యటిస్తున్న వేళ... ఆదేశాన్ని భారత్ లో కలపాలంటూ బీజేపీ సీఎం వ్యాఖ్యలు

బాంగ్లా దేశ్, పాకిస్తాన్ లను భారత్ లో కలిపి అఖండ భారత్ కోసం రాహుల్ గాంధీ కృషి చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. బాంగ్లా దేశ్ ప్రధాని మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

బాంగ్లాదేశ్ పీఎం భారత్ లో పర్యటిస్తున్న వేళ... ఆదేశాన్ని భారత్ లో కలపాలంటూ బీజేపీ సీఎం వ్యాఖ్యలు
X

పొరుగు దేశ ప్రధాని షేక్ హసీనా భారత్‌ పర్యటనలో ఉన్న సమయంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బంగ్లాదేశ్‌ను భారత్ లో కలపడం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

'భారత్ జోడో యాత్ర' పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,500 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు శర్మ‌ సమాధానమిచ్చారు.

"భారతదేశం ఐక్యంగా ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, సిల్చార్ నుండి సౌరాష్ట్ర వరకు మనం అందరం ఒక్కటిగానే ఉన్నాం. కాంగ్రెస్ మన దేశాన్ని భారతదేశం, పాకిస్తాన్ లుగా విభజించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ సృష్టించబడింది. భారత భూభాగంలో 'భారత్ జోడో' అవసరం లేదు. రాహుల్ గాంధీ, తన తాత జవహర్‌లాల్ నెహ్రూ తప్పు చేశారని క్షమాపణలు చెప్పి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఏకం చేసి, అఖండ భారత్‌ను రూపొందించడానికి ప్రయత్నించాలి" అని అన్నారు.

'అఖండ భారత్' అనేది BJP యొక్క సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్దాంతం. ఆరెస్సెస్ ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్ మరియు మయన్మార్‌లు అవిభక్త భారతదేశంలో భాగం. వాటన్నింటినీ మళ్ళీ ఏకం చేసి అఖండ్ భారత్ గా మార్చాలని ఆరెస్సెస్ ఆలోచన.

షేక్ హసీనా నాలుగు రోజుల భారత్ పర్యటనలో ఉన్న సమయంలో బంగ్లాదేశ్‌ను భారత్‌లో విలీనం చేయాలని అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.

ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు ఏడు అవగాహన ఒప్పందాల (ఎంఓయూలు)పై సంతకాలు చేశాయి.

"భారతదేశంతో మాకు మంచి స్నేహ సంబంధాలున్నాయి.. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రత్యేకించి మా విముక్తి యుద్ధంలో భారతదేశం చేసిన సహకారాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తుచేసుకుంటాము. మేము ఒకరికొకరు సహకరించుకుంటున్నాము" అని బంగ్లాదేశ్ ప్రధాని నిన్న చెప్పారు.

ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

First Published:  7 Sep 2022 11:56 AM GMT
Next Story