Telugu Global
National

ఆమె పరీక్ష హాల్ కి వెళ్లేందుకు భారీ పోలీస్ భద్రత..

కేవలం సోషల్ మీడియాలో ఓ కవితను పోస్ట్ చేసినందుకే బర్షశ్రీ అరెస్ట్ అయింది.

ఆమె పరీక్ష హాల్ కి వెళ్లేందుకు భారీ పోలీస్ భద్రత..
X

సోషల్ మీడియాలో కవిత రాసినందుకు అరెస్ట్ అయి జైలులో ఉన్న అస్సోం విద్యార్థిని బర్షశ్రీ బురగౌహైన్ కి పరీక్షలు రాసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆమె పోలీస్ సెక్యూరిటీ మధ్య పరీక్ష హాలుకి వెళ్లడానికి సిద్ధమైంది. మే 18నుంచి బర్షశ్రీ జైలు జీవితం అనుభవిస్తోంది. ఆమె చేసిన తప్పల్లా సోషల్ మీడియాలో ఓ కవితను పోస్ట్ చేయడమే. ఆమె ఉల్ఫా తీవ్రవాదులకు మద్దతిచ్చారంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె పరీక్షలకు గోలాఘాట్ జిల్లా స్థానిక కోర్టు అనుమతివ్వడంతో మరోసారి బర్షశ్రీ వార్తల్లో నిలిచారు.

ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో అమాయకులు చాలామంది రాజద్రోహులుగా మిగిలిపోతున్నారు. కేవలం సోషల్ మీడియాలో ఓ కవితను పోస్ట్ చేసినందుకే బర్షశ్రీ అరెస్ట్ అయింది. అకో కొరిమ్ రాష్ట్ర ద్రోహ్ (ఐ విల్ రెబల్ అగైనెస్ట్ ద నేషన్ అగైన్) అనే కవితను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బర్షశ్రీ. జోర్హాట్ జిల్లాలోని డీసీబీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆమె.. ఆ కవిత రాసింది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ - ఉల్ఫా (ఇండిపెండెంట్) తీవ్రవాద సంస్థకు ఆమె మద్దతిచ్చినట్టు పోలీసులు కేసు పెట్టారు. ఉల్ఫాలో చేరికలను ఆమె ప్రోత్సహిస్తోందని డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత చెప్పారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలంటూ యువతకు పిలుపునిచ్చిందని, అందుకే అరెస్ట్ చేశామంటూ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అన్నారు. కాదు కాదు ఆమె ఉల్ఫా లో చేరేందుకు ప్రయత్నించిందని, అందుకే అరెస్ట్ చేశారని చెప్పారు సీఎం హిమంత బిశ్వ శర్మ. వీటిలో ఏది నిజం, ఎంత నిజం అనే విషయం పక్కనపెడితే.. ఆమె మాత్రం అరెస్ట్ అయింది.

ముందుగా ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తామంటూ పోలీసులు తీసుకెళ్లారు. సోషల్ మీడియా పోస్టింగ్ లన్నిటినీ ఆమె తొలగించేలా చేశారు. మే 18న విడుదల చేస్తామని చెప్పి, అదేరోజు కోర్టుకి హాజరు పరిచారు. అప్పటినుంచి ఆమె జైలులోనే ఉంటోంది. శనివారం నుంచి ఆమెకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షలకు అనుమతివ్వాలంటూ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు, పోలీస్ సెక్యూరిటీతో ఆమెను పరీక్ష హాలుకి తీసుకెళ్లాలని ఆదేశాలిచ్చింది.

First Published:  16 July 2022 4:09 AM GMT
Next Story