Telugu Global
National

అస్సాంలో జిహాదీ గ్రూపుల ప్ర‌వేశంతో ఆందోళ‌న‌!

అస్సాంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోవడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ నుంచి అస్సాంకు ఉగ్రవాదుల వలస సాగుతోందని ఆయన చెప్పారు.

అస్సాంలో జిహాదీ గ్రూపుల ప్ర‌వేశంతో ఆందోళ‌న‌!
X

వ‌ర‌ద‌లు, రాజ‌కీయ తిరుగుబాట్ల‌కు కేంద్రంగా నిలిచి ఇటీవ‌ల కాలంలో బాగా ప్ర‌జ‌ల నోళ్ళ‌లో నానిన అస్సాం రాష్ట్రం మ‌రోసారి వార్త‌ల్లో నిలుస్తోంది. రాష్ట్రంలో జిహాదీ గ్రూపులు క‌ల‌క‌లం సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు అధికారులు గుర్తించారు. గత ఐదు నెలల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్ ఇస్లాంతో సంబంధాలున్నవారు అస్సాంలో జిహాదీ కార్యకలాపాలు సాగిస్తున్నారని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.

అన్సరుల్ ఇస్లాంకు చెందిన ఆరుగురు బంగ్లాదేశ్ యువకులు మ‌ద‌ర్సాల‌లో బోధించడానికి అస్సాంలోకి ప్రవేశించారని, మార్చిలో బార్‌పేటలో వారిలో ఒకరిని అరెస్టు చేశార‌న్నారు. ఇంతకుముందు, అక్క‌డ‌డ‌క్క‌డా ఇటువంటి సంఘటనలు జరిగాయి, కానీ ఇప్పుడు ప‌రిస్థితి తీవ్రంగా ఉంది. ప్రైవేట్ మదర్సాలలో ముస్లిం యువకులకు రాష్ట్రం బ‌య‌టినుంచి వ‌చ్చిన ఇమామ్‌లు బోధించ‌డం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ విషయం చాలా తీవ్రమైనదని, కేంద్ర ఏజెన్సీలతో పాటు పోలీసులు గట్టి నిఘాను కొనసాగిస్తున్నారని చెప్పారు.

"జిహాదీ కార్యకలాపాలు తీవ్రవాద, తిరుగుబాటు కార్యకలాపాలకు చాలా భిన్నంగా ఉంటాయి. ఇది సంవత్సరాల పాటు బోధనతో మొదలై, ఇస్లామిక్ ఛాందసవాదాన్ని ప్రోత్సహించడంలో చురుకుగా పాల్గొనడంతోపాటు చివరకు విధ్వంసకర కార్యకలాపాలకు దారి తీస్తుంది," అని ముఖ్యమంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

అన్సరుల్ ఇస్లాం సంస్త‌కు అల్-ఖైదాతో సంబంధాలు ఉన్నాయి. దాని మాస్టర్ మైండ్ అల్-జవహిరి ఇటీవల అస్సాంలో జిహాద్ గురించి ప్రస్తావించ‌డం గ‌మ‌నార్హం. దీన్నిబట్టి "రాష్ట్రం ఖచ్చితంగా వారి రాడార్‌లో ఉందని రుజువు చేస్తుంది" అని ముఖ్య‌మంత్రి అన్నారు. 2016-17లో అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ జాతీయులు, కోవిడ్ మహమ్మారి సమయంలో అనేక శిక్షణా శిబిరాలను నిర్వహించారని ఆయన పేర్కొన్నారు.

"జిహాద్‌కు సంబంధించిన అనేక పుస్తకాలు,వీడియోలు మదర్సాల నుండి, అన్సరుల్ ఇస్లాంతో సంబంధాలు ఉన్న వ్యక్తుల నుండి స్వాధీనం చేసుకున్నారు." అని ఆయన చెప్పారు. అంతేకాక‌, వారు అత్యంత అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉప‌యోగిస్తున్న‌ట్టు ద‌ర్యాప్తులో వెల్ల‌డైంద‌న్నారు. "

First Published:  5 Aug 2022 5:31 AM GMT
Next Story