Telugu Global
National

అశోక్ గెహ్లాట్ Vs సచిన్ పైలట్: రాజస్థాన్ కాంగ్రెస్ లో మళ్ళీ కుమ్ములాట

తాజాగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై, సచిన్ పైలట్ తీవ్ర విమర్శలతో విరుచుకపడ్డారు. మాజీ సీఎం, బీజేపీ నాయకురాలు వసుంధర రాజేతో గెహ్లెట్ చేతులు కలిపారని సంచలన ఆరోపణలు చేశారు.

అశోక్ గెహ్లాట్ Vs సచిన్ పైలట్: రాజస్థాన్ కాంగ్రెస్ లో మళ్ళీ కుమ్ములాట
X

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెల్చిన నాటి నుంచే అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ల మధ్య‌ యుద్ద వాతావరణం నెల‌కొంది. ముఖ్యమంత్రి అవుదామనుకున్న సచిన్ పైలట్ ఆశలపై నీళ్ళు పోసిన అధిష్టానం గెహ్లెట్ ను సీఎంగా నియమించింది. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది ఓ సమయంలో సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ప్రభుత్వం పడిపోతుందనే పరిస్థితి కూడా కల్పించారు. అయితే అధిష్టానం కల్పించుకొని పరిస్థితిని చక్కదిద్దినప్పటికీ కుమ్ములాటలు మాత్రం ఆగలేదు.

తాజాగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై, సచిన్ పైలట్ తీవ్ర విమర్శలతో విరుచుకపడ్డారు. మాజీ సీఎం, బీజేపీ నాయకురాలు వసుంధర రాజేతో గెహ్లెట్ చేతులు కలిపారని సంచలన ఆరోపణలు చేశారు. వసుంధరా రాజే సీఎం గా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై విచారణ జరిపించడంలో అశోక్ గెహ్లెట్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకునిరసనగా ఈ నెల 11న నిరహార దీక్ష చేపడతానని ప్రకటించారు.

ఆదివారం రాజస్థాన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సచిన్ పైలట్, "వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతి కేసులపై అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా వ్యవహరించడం వల్ల, మా ప్రత్యర్థులు మమ్ములను ప్రశ్నిస్తున్నారు" అని అన్నారు.

జ్యోతిబా ఫూలే జయంతి రోజున ఏప్రిల్ 11 న ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు, తద్వారా అవినీతి సమస్యలపై దర్యాప్తు జరిగేలా ప్రభుత్వం వత్తిడి తీసుకొస్తానని ఆయన అన్నారు.

“మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేసినందువల్లే మేము అధికారంలోకి వచ్చాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వసుంధర రాజే ప్రభుత్వ హయాంలో మేము అనేక అవినీతి సమస్యలను లేవనెత్తాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము లేవనెత్తిన సమస్యలపై చర్యలు తీసుకున్నప్పుడే మా విశ్వసనీయత నిలబడుతుంది.'' అన్నారు పైలట్

.‍“నేను గత ఏడాది మార్చి 28న మైనింగ్ మాఫియాకు సంబంధించిన అవినీతి కేసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖలు రాశాను. అయితే, నాకు ఎలాంటి సమాధానం రాలేదు. నవంబర్ 2న మళ్లీ లేఖ రాశాను” అని పైలట్ విలేకరుల సమావేశంలో అన్నారు.

First Published:  9 April 2023 10:52 AM GMT
Next Story