Telugu Global
National

ప్రజల్ని 'సాయుధం' చేస్తున్న సర్వసంగ పరిత్యాగులు!!

సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ మాలెగావ్ పేలుళ్ల కేసులో కీలక నిందితురాలు.2008 సెప్టెంబరు 29వ తేదీ రాత్రి మహారాష్ట్రలోని మాలెగావ్ ప్రాంతంలో షకీల్ గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ బయట పార్కు చేసిన ఎల్ఎంఎల్ ఫ్రీడం బైకు పేలడంతో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.

ప్రజల్ని సాయుధం చేస్తున్న సర్వసంగ పరిత్యాగులు!!
X

''హిందు సమాజం తమను తాము రక్షించుకునేందుకు ఇండ్లలో పదునైన ఆయుధాలను పెట్టుకోవాలి.ఆత్మగౌరవాన్ని కాపాడుకునే హక్కు హిందువులకు ఉన్నది.దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణచివేతదారులను, పాపాత్ములందరినీ అంతం చేయాలి.ఎవరైనా మన ఇంట్లోకి చొరబడి మనపై దాడి చేస్తుంటే తగిన రీతిలో సమాధానం ఇవ్వడం మనకున్న హక్కు''. అని కర్ణాటక శివమొగ్గలో హిందూ జాగరణ వేదిక సదస్సులో మధ్యప్రదేశ్‌ భోపాల్‌ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ అన్నారు.ఈ సాధ్వీ నోట ఇలాంటి 'సాయుధ' భాష కొత్త ఏమీ కాదు.పేరుకే సన్యాసి తప్ప ఆమె చుట్టూ ఎప్పుడూ వివాదాలు ముసురుకుంటూనే ఉంటాయి.

సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ మాలెగావ్ పేలుళ్ల కేసులో కీలక నిందితురాలు.2008 సెప్టెంబరు 29వ తేదీ రాత్రి మహారాష్ట్రలోని మాలెగావ్ ప్రాంతంలో షకీల్ గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ బయట పార్కు చేసిన ఎల్ఎంఎల్ ఫ్రీడం బైకు పేలడంతో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం చీఫ్ హేమంత్ కర్కరే ఈ కేసును దర్యాప్తు చేశారు. ఆ మోటారు సైకిల్ ఏబీవీపీ మాజీ కార్యకర్త ఠాకుర్ కు చెందినదని గుర్తించారు. దాంతో పుణె, నాసిక్, భోపాల్, ఇండోర్ తదితర ప్రాంతాలకు వెళ్లి ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయలను అరెస్టుచేశారు.అభినవ భారత్ అనే సంస్థకు చెందిన సుధాకర్ ద్వివేది అలియాస్ దయానంద పాండే పాత్ కూడా ఉన్నట్లు తేలింది.భారతదేశంలో జీహాదీ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్ విచారణలో తెలిసింది.2009 జనవరి 20న చార్జిషీటు దాఖలు చేశారు. 2011 ఏప్రిల్ 21న అనుబంధ చార్జిషీటు కూడా దాఖలైంది. అందులో ఏటీఎస్ 14 మంది నిందితుల పేర్లను పేర్కొంది. వారిలో శివనారాయణ్ కల్సంగ్రా, శ్యామ్ సాహు, సమీర్ కులకర్ణి అజయ్ అలియాస్ రాజా రహికార్, రాకేశ్ ధావడే, జగదీశ్ మాత్రే, సుధాకర్ చతుర్వేది, ప్రవీణ్ తకాల్కి, రామచంద్ర కల్సంగ్రా, సందీప్ డాంగే ఉన్నారు. ఈ

2010 డిసెంబరులో సీబీఐ వర్గాలు నబాకుమార్ సర్కార్ అలియాస్ అసీమానందను అరెస్టుచేశారు. జీహాదీ ఉగ్రవాదంపై ప్రతీకారంగానే 2006, 08లలో పేలుళ్లు జరిగాయని అసీమానంద అంగీకరించారు. ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ సునీల్ జోషి నేతృత్వంలోని బృందం ముస్లింలను హతమార్చాలని ప్రణాళిక వేసిందని ఆయన చెప్పారు. సమఝౌతా ఎక్స్ ప్రెస్, అజ్మేర్ దర్గా, మక్కా మసీదు పేలుళ్ల వెనుక కూడా ఇదే సంస్థ ఉందన్నారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు.ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. తర్వాత ఈ కేసులన్నీ ఎన్ఐఏ విచారణకు బదిలీ అయ్యాయి.

2008 అక్టోబరు 24న సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకుర్ ను అరెస్టు చేశారు. 2008 మాలెగావ్ పేలుళ్లలో ఆమె మోటారు సైకిల్ వాడటంతో ఆ కేసులోనే ఆమె పేరు చార్జిషీటులో నమోదైంది.అనేక సమావేశాలలో ఆమె పాల్గొన్నారని ఏటీఎస్ ఆరోపించింది. ఫరీదాబాద్, భోపాల్, కోల్ కతా, జబల్పూర్, ఇండోర్, నాసిక్ ప్రాంతాలలో 2008 జనవరిలో సమావేశాలు జరిపి, తర్వాత మాలెగావ్ పేలుళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. సాధ్వి స్వయంగా ముగ్గురిని ఎంపిక చేసి దాడి చేయించారని చెప్పారు. వాళ్లే సునీల్ జోషి, రామచంద్ర కల్సంగ్రా, సందీప్ డాంగే అని ఏటీఎస్ అధికారులు తెలిపారు.కాగా అసీమానంద, సాధ్వికి 2003 నుంచే తెలుసని ఎన్ఐఏ తన సమఝౌతా పేలుళ్ల కేసు చార్జిషీటులో తెలిపింది.ఆలయాల మీద ఉగ్రవాద దాడులపై అసీమానంద గతంలో సాధ్వి, జోషిలతో చర్చల సందర్భంలో ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. నిందితుల మధ్య సంభాషణలను కూడా ఎన్ఐఏ వర్గాలు పసిగట్టాయి. అందులో రమేశ్ ఉపాధ్యాయ, లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ మాట్లాడినపుడు 'సింగ్ సాహెబ్' అని ప్రస్తావించేవారని ఎన్ఐఏ తెలియజేసింది.

తాను పలు సమావేశాలలో పాల్గొన్నట్టు ఆర్ఎస్ఎస్ సభ్యుడు యశ్ పాల్ భందనా ఒప్పుకున్నారు.ఫరీదాబాద్ లో 2008 జనవరి 26న జరిగిన సమావేశంలో 'జీహాదీలపై గెరిల్లా యుద్ధం' చేయాలన్న ప్రస్తావనను కల్నల్ పురోహిత్ తెచ్చారని ఆయన అన్నారు. రెండో సమావేశంలో ఏం చేసినా త్వరగా చేయాలన్నారన్నారు. మాలెగావ్ లో ముస్లింల జనాభా ఎక్కువని, అక్కడ బాంబులు పేల్చితే ప్రతీకారం తీరుతుందని నిర్ణయించినట్టు, దానికి మనుషులను తాను సిద్ధం చేస్తానని సాధ్వి ప్రగ్యాసింగ్ చెప్పినట్టు యశపాల్ తెలిపారు.

యూపీఏ 2 హయాంలో కేంద్ర హోంశాఖ సూచనల మేరకు 2011లో ఎన్ఐఏ ఆ కేసు విచారణ చేపట్టింది.బీజేపీ అధికారంలోకి వచ్చింతర్వాత 2016లో చార్జిషీటు దాఖలుచేశారు. ప్రగ్యాసింగ్ ఠాకుర్ ను నిర్దోషిగా వదిలిపెట్టి, కల్నల్ పురోహిత్ ను నిందితునిగా ఎన్ ఐ ఏ పేర్కొంది. సాక్ష్యాలు బలహీనంగా ఉండటంతో నిందితులందరిపై ఆరోపణలను వెనక్కి తీసుకుంది.మోటారు సైకిల్ ప్రగ్యాసింగ్ ఠాకుర్ దే అయినా, రెండేళ్లుగా దాన్ని కల్సాంగ్రా వాడుతున్నారని, దాని నిర్వహణ ఖర్చులు కూడా అతడే చెల్లించాడని సాక్ష్యం ప్రవేశపెట్టింది.పేలుళ్ళ కుట్రలలో ప్రగ్యాసింగ్ ఠాకూర్ భాగమని నిరూపించేందుకు మేజిస్ట్రేట్ ఎదుట ఒక్క వాంగ్మూలంకూడా నమోదు కాలేదని ఎన్ఐఏ తెలిపింది.యశ్ పాల్ భందనా ఇచ్చిన సాక్ష్యాలలో పసలేదంటూ తిరస్కరించింది.దాంతో సాధ్విని బెయిల్ మీద విడుదల చేశారు.

2019లో భోపాల్ నుంచి బీజేపీ ఎంపీగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా ముంబై నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. 2008 మాలెగావ్ పేలుళ్ల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానానికి తెలిపారు.ఉగ్రవాద కేసులలో నిందితులలో ఒకరైన ప్రగ్యాసింగ్ ఠాకూర్ ను బీజేపీ టికెట్ ఇవ్వడం సంచలనం రేపింది. ముంబై కోర్టులో 'ద అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్' (యూఏపీఎ)కింద ఇప్పటికీ విచారణ ఎదుర్కుంటున్నారు.

ఒక వేళ బీజేపీ అధికారంలోకి రాకుండా ఉంటే ఈ కేసు సక్రమంగా జరిగేదన్న వాదనలూ ఉన్నాయి. ఈ కేసును బైటికి తీసిన మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం చీఫ్ హేమంత్ కర్కరే ముంబైపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడినప్పుడు జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. ఆయన మరణం విషయంలో కూడా విరుద్ద వాదనలున్నాయి. మహారాష్ట్రలో ఐజీ గా పని చేసి రిటైర్ అయిన ఐపీఎస్ అధికారి ఎస్ ఎమ్ ముష్రాఫ్ ఈ విషయంపై 'హేమంత్ ఖర్కరేను ఎవరు చంపారు' అనే పుస్తకం కూడా రాశారు. అందులో ఆయన ఖర్కరే మరణానికి టెర్రరిస్టులు కారణం కాదని రాశారు.

First Published:  28 Dec 2022 7:27 AM GMT
Next Story