Telugu Global
National

ప్రధాని పీఠంపై కన్ను... జాతీయ స్థాయి ప్రచారం ప్రారంభించిన కేజ్రీవాల్

2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ 'మేక్ ఇన్ ఇండియా నెంబర్ వన్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ స్థాయిలో అన్నిపార్టీలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రధాని పీఠంపై కన్ను... జాతీయ స్థాయి ప్రచారం ప్రారంభించిన కేజ్రీవాల్
X

దేశ ప్రధాని పీఠంపై అనేక మంది విపక్ష నేతల కన్ను ఉంది. విపక్షాలన్ని‍ంటినీ కూడగట్టుకొని బీజేపీని ఓడించి ప్రధాని పదవిని చేపట్టాలని ఉవ్విళ్ళూరుతున్న నేతల లిస్ట్ పెరిగిపోతోంది. ఆ ప్రయత్నాల్లో మమతా బెనర్జీ, కేసీఆర్, శరద్ పవార్, కేజ్రీవాల్ తో పాటు ఇప్పుడు కొత్తగా నితీష్ కుమార్ కూడా వచ్చి చేరారు. అయితే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి, మరిన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికార పోరులో ముందున్నామనే నమ్మకంగా ఉంది. అందుకే ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఒకవైపు గుజరాత్ పై దృష్టి కేంద్రీకరిస్తూనే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు తన పార్టీని విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆ పార్టీ గుజరాత్ లో అధికారంలోకి వస్తామని నమ్మకంగా ఉంది. ఇక ఇప్పుడు 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 'మేక్ ఇన్ ఇండియా నెంబర్ వన్' పేరిట జాతీయస్థాయి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జాతీయ జెండా ఊపి ఈ ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్ ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తాను దేశమంతా పర్యటి‍స్తానని ఈమిషన్ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు.

దేశ ప్రజలందరికీ ఉచిత విద్య, ఆరోగ్య సదుపాయాలు, యువతకు ఉపాధి, మహిళలకు సమాన అవకాశాలు, రైతులకు మద్దతు ధర కల్పించాలన్న ఐదు లక్ష్యాలతో ఈ మిషన్ ను ప్రారంభించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవుతే దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంటుందని ఆయ‌న అన్నారు.

''ఎంత డబ్బు ఖర్చయినా దేశంలోని ప్రతి బిడ్డ చదువుకునేలా చేయడమే మన ప్రథమ కర్తవ్యం. అలాగే ప్రతి పౌరుడికి మెరుగైన , ఉచిత వైద్యం అందేలా చూడాలి. దేశంలోని ప్రతి పల్లెలో, పట్టణాల్లో మూల మూలల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు నెలకొల్పాలి. ఈ దేశంలోని ప్రతి యువకుడికి, యువతికి ఉద్యోగం ఉండాలి. ఈ దేశంలో ప్రతి మహిళను గౌరవించాలి, ప్రతి ఒక్కరూ సమాన హక్కులు , భద్రత పొందాలి, ఈ దేశంలోని రైతులకు మద్దతు ధర కల్పించాలి. ఈ ఐదు లక్ష్యాలను సాధిస్తే మనదేశంప్రపంచంలోనే నంబర్ 1 గా మారడ‍ం తథ్యం'' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

మరి రాజకీయాలకు అతీతంగా అని చెప్తున్న ఆయన 'మేక్ ఇన్ ఇండియా నెంబర్ వన్' కార్యక్రమాన్ని ప్రజలు ఎంత వరకు ఆదరిస్తారు అనే దానిని బట్టి ఆయన అసలు లక్ష్యమైన ప్రధాని పీఠం లభ్యమవుతుంది.

First Published:  17 Aug 2022 2:15 PM GMT
Next Story