Telugu Global
National

దొంగతనం కేసులో కేంద్ర మంత్రికి అరెస్ట్ వారెంట్

విచారణకు ప్రామాణిక్ కానీ, ఆయన తరపున లాయర్ కానీ హాజరు కానందుకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.

దొంగతనం కేసులో కేంద్ర మంత్రికి అరెస్ట్ వారెంట్
X

కేంద్ర మంత్రి ఏంటీ? దొంగతనం చేయడం ఏంటి? అరెస్ట్ వారెంట్ రావడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా.! కానీ అక్షరాలా ఇది నిజం. మోడీ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిశిత్ ప్రామాణిక్‌ను ఓ దొంగతనం కేసులో అరెస్టు చేయాలని పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దువార్ కోర్టు వారెంట్ జారీ చేసింది. కేంద్ర మంత్రిని ఓ దొంగతనం కేసులో అరెస్టు చేయాలనే వార్త ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే..

పశ్చిమబెంగాల్‌లోని అలీపూర్‌దువార్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ బంగారు దుకాణంతో పాటు, బీర్‌పాడాలోని రెండు దుకాణాల్లో 2009లో దొంగతనం జరిగింది. ఆ కేసులో నిశిత్ ప్రామాణిక్‌తో పాటు మరో వ్యక్తి నిందితుడిగా పేర్కొన్నారు. ఈ కేసును విచారిస్తున్న 24 పరగణాల జిల్లా ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు నుంచి దీనిని ఇటీవలే అలీపూర్‌దుగార్ కోర్టుకు బదిలీ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జహర్ మజందార్ తెలిపారు. కలకత్తా హైకోర్టు సూచనల మేరకే ఈ కేసును ప్రస్తుతం అలీపూర్‌దుగార్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారిస్తున్నది. కాగా, కేసు విచారణకు హాజరు కావాలని నవంబర్ 11న ప్రామాణిక్‌తో పాటు మరో నిందితుడికి సమన్లు జారీ చేశారు. కానీ, ప్రామాణిక్ తరపున ఎవరూ హాజరు కాలేదు.

విచారణకు ప్రామాణిక్ కానీ, ఆయన తరపున లాయర్ కానీ హాజరు కానందున కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కాగా, తదుపరి ఏం చేయబోతున్నారో ప్రామాణిక్ లాయర్ దులాల్ ఘోష్ వెల్లడించలేదు. ఈ విషయంపై కామెంట్ చేయడానికి అలీపూర్‌దుగార్ సూపరింటెండ్‌ ఆఫ్ పోలీస్ నిరాకరించారు.

పశ్చిమ బెంగాల్‌లోని దిన్హాతా పట్టణానికి చెందిన ప్రామాణిక్ 2019 ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున కూచ్‌బెహర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. మోడీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రామాణిక్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బహిష్కరించారు.

First Published:  17 Nov 2022 4:32 AM GMT
Next Story