Telugu Global
National

అర్హత లేని సినిమాలు ఆస్కార్ కు.. అందుకే అవి వెనక్కి.. ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు

'అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నట్లు అనిపిస్తోంది. అందుకే అవి అవార్డు సాధించలేక నిరాశతో వెనక్కి వస్తున్నాయి. కానీ, దీనిపై చూస్తూ ఉండటం తప్ప మనం ఏం చేయలేం' అని కామెంట్స్ చేశాడు.

అర్హత లేని సినిమాలు ఆస్కార్ కు.. అందుకే అవి వెనక్కి.. ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు
X

ఆస్కార్ అవార్డుల కోసం అర్హత లేని సినిమాలను పంపుతున్నారని, అందుకే అవి అవార్డు దక్కించుకోలేక వెనక్కు వస్తున్నాయని రెండుసార్లు ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ మూవీకి ఇటీవల ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అవార్డు వచ్చింది.

అయితే ఈ సినిమాను ఇండియా తరఫున ఆస్కార్ కు పంపలేదు. ఒకవేళ దేశం తరఫున అఫీషియల్ గా పంపి ఉంటే ఈ సినిమా మరిన్ని అవార్డులు సాధించేదని ఇటీవల జోరుగా వ్యాఖ్యలు వినిపించాయి. గుజరాతీలో నిర్మితమైన చెల్లో షోను ఆస్కార్ కు పంపిన కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ను మాత్రం పక్కన పెట్టింది.

అయితే ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి పట్టు వదలని విక్రమార్కుడిలా జనరల్ కేటగిరీలో ఆస్కార్ కోసం అప్ల‌య్‌ చేసుకోగా నాటు నాటు పాటకు అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రెహమాన్ తన యూట్యూబ్ ఛానల్ లో సంగీత దిగ్గజం ఎల్ సుబ్రహ్మణ్యంతో ఇటీవల మాటామంతీ నిర్వహించారు.

ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ.. 'అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నట్లు అనిపిస్తోంది. అందుకే అవి అవార్డు సాధించలేక నిరాశతో వెనక్కి వస్తున్నాయి. కానీ, దీనిపై చూస్తూ ఉండటం తప్ప మనం ఏం చేయలేం' అని కామెంట్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ ను దేశం తరఫున ఆస్కార్ కు పంపకపోవడంపైనే రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.

First Published:  16 March 2023 9:58 AM GMT
Next Story