Telugu Global
National

'ఉచితాల వ్యతిరేకి' (మోడీ) బీజేపీ గుజరాత్ లో ఫ్రీ పథకాలకు తెరతీసింది

తాము ఉచితాలకువ్యతిరేకమంటూ, ప్రజలకు ఉచితాలు అలవాటు చేయడం మంచిది కాదని ప్రధాని మోడీ విపక్షాలకు నీతులు చెబుతూ ఉంటారు. అయితే ఆయన స్వంత రాష్ట్రం గుజరాత్ లో మాత్రం వాళ్ళ పార్టీ ఎన్నికల్లో గెలవడం కోసం ఉచితాలకు తెరలేపింది.

ఉచితాల వ్యతిరేకి (మోడీ) బీజేపీ  గుజరాత్ లో ఫ్రీ పథకాలకు తెరతీసింది
X

ఫ్రీబీలంటూ విపక్షాల మీద ప్రధాని మోడి విమర్శలు ఎక్కుపెట్టి ఎంతో కాలం కాలేదు. ఉచిత పథకాలు మంచిది కాదంటూ ఆయన విప‌క్షాలకు క్లాస్ తీసుకున్నారు. ప్రధాని మాటలు వింటే ఇక బీజేపీ ఉచిత పథకాలకు స్వస్థి చెప్తుందేమో అనుకున్నారు. అయితే ఇతరులకు చెప్పడానికే నీతులుంటాయని నిరూపించింది బీజేపీ.ఇతరులకు చెప్పడానికి తాము ఆచరించడానికి చాలా తేడా ఉంటుంది కదా ! ఆ తేడాతోనే ఇప్పుడు బీజేపీ గుజరాత్ లో ఫ్రీబీలకు తెగబడింది.

త్వరలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి బీజేపీ గెలవడం చాలా కష్టమే అనే వాదనలు వినవస్తున్నాయి. అయితే ఎలాగైనా గెలవడం కోసం స్థానిక నాయకులేకాక , ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు కూడా రంగంలోకి దిగారు. ఏదైనా చేసి అక్కడ మళ్ళీ అధికారంలోకి రావాలి అనేదే ప్రస్తుతం వాళ్ళ‌ టార్గెట్. అందుకే మతమూ, కులమూ, పాకిస్తాన్, ఉగ్రవాదం, చైనా, రాముడు...ఈ ప్రచారాలు సరిపోకపోవడంతో ఇక ప్రజలకు ఉచితాల ఇవ్వడం మీద దృష్టి కేంద్రీకరించారు.

రాష్ట్రంలోని 38 లక్షల కుటుంబాలకు సంవత్సరానికి రెండు వంట గ్యాస్ సిలండర్ లు ఉచితంగా ఇస్తామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.650 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.

రెండు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, గుజరాత్ ప్రభుత్వం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) , పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) పై వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT)ని కూడా 10 శాతం తగ్గించింది. దీని వల్ల CNG కిలోకుదాదాపు రూ.7, PNG కిలోకు రూ.6కి తగ్గింది.

బీజేపీకి మాత్రమే స్వంతమైన మత, పాక్, రాముడు తదితర నినాదాల పవర్ తగ్గడంతో ఈ ఉచితాలకు తెగబడిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉచితాలకు వ్యతిరేకమని మోడీ ప్రకటన ప్రజలు ఇంకా మర్చిపోకముందే ఉచితాలకు తెరలేపిన బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పుడే ఇలా అయితే ఎన్నికలు దగ్గరికొచ్చేసరికి ఇంకేం ఉచితాలు ఇస్తారో అంటూ జనం మాట్లాడుకుంటున్నారు.

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ, 'ఉచిత' సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉచిత విద్యుత్, విద్య, నిరుద్యోగ భృతి సహా ఉచితాలు ఇస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీని చాలా అవహేళన చేసిన అదే బిజెపి ఇప్పుడు 'యు' టర్న్ తీసుకొని రెండు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించడం పట్ల సోషల్ మీడియాలో నెటిజనులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ ఉచిత సిలిండర్ పథకం ప్రకటించడానికి చాలా ముందే, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బిజెపి పాలిత రాష్ట్రాలకు, ముఖ్యంగా గుజరాత్‌కు బిజెపి ఇస్తున్న ప్రాధాన్యతను, ఇతర రాష్ట్రాల పట్ల వివక్షను ఎత్తి చూపారు.

గుజరాత్ లో కేవలం ఆరు నెలల్లో దాదాపు రూ.80,000 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులను ప్రకటించారని, "ఇది ప్రజాస్వామ్యమా లేదా మోడీక్రసీనా లేదా వంచననా? అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

First Published:  19 Oct 2022 6:21 AM GMT
Next Story