Telugu Global
National

కౌరవులంటూ అవమానిస్తారా..? రాహుల్ పై మళ్లీ పరువునష్టం కేసు..

మోదీ ఇంటిపేరు వ్యవహారంలో నమోదైన పరువునష్టం కేసులో రాహుల్ కి ఇటీవల రెండేళ్లు జైలు శిక్ష పడగా, ఆర్ఎస్ఎస్ కూడా పరువునష్టం అంటూ కోర్టు మెట్లెక్కింది.

కౌరవులంటూ అవమానిస్తారా..? రాహుల్ పై మళ్లీ పరువునష్టం కేసు..
X

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఎదుర్కొని లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడైన రాహుల్ గాంధీని మరోసారి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది బీజేపీ. గతంలో మోదీ ఇంటిపేరుతో గాంధీని ఇరుకున పెడితే, ఈసారి ఆర్ఎస్ఎస్ ని తెరపైకి తెచ్చారు. జనవరి 9న హర్యానాలోని అంబాలాలో భారత్ జోడో యాత్ర తర్వాత స్ట్రీట్ కార్నర్ సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసు నమోదైంది. ఈనెల 12న ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కోర్టులో ఈ కేసు విచారణకు వస్తుంది.

రాహుల్ ఏమన్నారు..?

ఆర్ఎస్ఎస్ సభ్యులను రాహుల్ గాంధీ 21వ శతాబ్ధపు కౌరవులుగా విమర్శించారు. అంబాలాలో ప్రసంగించిన రాహుల్ ‘‘కౌరవులు ఎవరు..? మీకు 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెబుతా.. వారు ఖాకీ హాఫ్ ప్యాంటు ధరిస్తారు. చేతిలో లాఠీలు పట్టుకుంటారు, శాఖలు నిర్వహిస్తారు, భారత దేశంలో ఇద్దరు ముగ్గురు బిలియనీర్లు ఈ కౌరవులతో నిలబడి ఉన్నారు’’ అంటూ పరోక్షంగా ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు రాహుల్. అప్పట్లో దీనిపై రాద్ధాంతం జరిగినా, పరువునష్టం కేసు అంటూ ఎవరూ హడావిడి చేయలేదు.

మోదీ ఇంటిపేరు వ్యవహారంలో నమోదైన పరువునష్టం కేసులో రాహుల్ కి ఇటీవల రెండేళ్లు జైలు శిక్ష పడగా, ఆర్ఎస్ఎస్ కూడా పరువునష్టం అంటూ కోర్టు మెట్లెక్కింది. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కోర్టులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా ఫిర్యాదు మేరకు న్యాయవాది అరుణ్ భదౌరియా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 12న విచారణ జరగాల్సి ఉంది.

First Published:  1 April 2023 12:32 PM GMT
Next Story