Telugu Global
National

అగ్నిపథ్‌లో కులాల కుంపటి..

అగ్నివీర్‌లలో ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత కుల పక్షపాతాన్ని సృష్టించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారంటూ ఆర్జేడీ కూడా మండిపడింది. దీంతో బీజేపీ ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకుంది.

అగ్నిపథ్‌లో కులాల కుంపటి..
X

అగ్నిపథ్ పథకం చుట్టూ మరో వివాదం ముసురుకుంది. అగ్నివీర్‌లుగా రిక్రూట్ చేసుకునేవారి నుంచి తీసుకుంటున్న అప్లికేషన్లలో కులం అనే కాలమ్ ఉందని, కులం, మతానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు అడుగుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. అగ్నివీర్‌ల‌ పేరుతో మత విధ్వంసం సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు ఆప్ నేతలు. అగ్నివీర్‌లలో ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత కుల పక్షపాతాన్ని సృష్టించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారంటూ ఆర్జేడీ కూడా మండిపడింది. దీంతో బీజేపీ ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకుంది.

పథకం పేరు అగ్నివీర్ అయినా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో జరిగే అన్ని రకాల నియమ నిబంధనలు పాటిస్తున్నామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. కులం, మతం గురించి తెలుసుకునే కాలమ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో ఉందని, అయితే ప్రాథమిక సెలక్షన్‌లో కుల ప్రాతిపదిక ఏదీ లేదని చెప్పారాయన. "సెలక్షన్ ప్రక్రియకు సంబంధించినంత వరకు కులం పాత్ర లేదని భారత సైన్యం 2013లోనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది, అయితే కులానికి కాలమ్ మాత్రం అప్లికేషన్లో ఉంటుంది. అది అడ్మినిస్ట్రేటివ్ అవసరం, అందుకే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో దాన్ని పూరించాల్సిన అవసరం ఉంది." అని చెప్పారాయన.

ఇండియన్ ఆర్మీ క్లారిటీ..

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌లో కులాల ప్రాతిపదిక ఏదీ లేదని ఇండియన్ ఆర్మీ కూడా స్పష్టం చేసింది. అగ్నివీర్ కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పాలసీలో ఎలాంటి మార్పు చేయలేదని చెప్పారు ఆర్మీ అధికారులు. శిక్షణ సమయంలో మరణించే రిక్రూటీలు, లేదా యుద్ధంలో మరణించే సైనికులకు మతపరమైన ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని, దీనికి కూడా ఇది అవసరపడుతుందని తెలిపారు అధికారులు.

First Published:  19 July 2022 9:48 AM GMT
Next Story