Telugu Global
National

ఐఐటీల్లో హిందీ మీడియం.. కేంద్రం మరో పైత్యం..

హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో హిందీ మీడియంలో బోధన సాగాలని చెప్పింది పార్లమెంట్ కమిటీ. ఇతర రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో బోధించాలని సూచించింది.

ఐఐటీల్లో హిందీ మీడియం.. కేంద్రం మరో పైత్యం..
X

అధికార భాషగా హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు ఐఐటీల్లో కూడా హిందీ మీడియం తీసుకురావాలని చూస్తోంది. ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలతోపాటు.. టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ కోర్సులు అందించే కేంద్రీయ విద్యా సంస్థల్లో హిందీతోపాటు స్థానిక భాషలను మాధ్యమాలుగా ఉపయోగించుకోవాలని హితబోధ చేస్తోంది. ఈమేరకు అధికార భాషా పార్లమెంట్‌ కమిటీ సిఫార్సు చేసింది. కేంద్రీయ విద్యాసంస్థల్లో ఇంగ్లిష్ భాష వాడకాన్ని కాస్త తగ్గించి భారతీయ భాషలకు తగిన ప్రాధాన్యతను కల్పించాలని చెబుతోంది. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ కమిటీ సిఫార్సులు అందజేసింది. ఇంగ్లిష్ ను కేవలం ఆప్షనల్ గా మాత్రమే వాడాలని కమిటీ సూచిస్తోంది. ఈ కమిటీకి హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షుడు కావడం విశేషం.

ఎందుకీ అవస్థ..

ఇప్పటి వరకూ ఇంగ్లిష్ మీడియంతో వచ్చిన సమస్యలేవీ లేవు, కేంద్రీయ విద్యా సంస్థల్లో హిందీ మీడియంలో బోధన మొదలు పెడితే మాత్రం కచ్చితంగా సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. హిందీ మీడియం, లేదా స్థానిక మీడియంలో చదివే విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తే సమర్థంగా పనిచేయలేరు. కనీసం తమ ప్రాంతంలో కూడా ఇతర ఉద్యోగులతో కలసి వర్క్ షేర్ చేసుకోలేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. టెక్నికల్ కోర్సుల విషయంలో పురోగమనం ఉండాలి కానీ, ఇలా ఇంగ్లిష్ ని కాదనడం తిరోగమనమే అవుతుందని అంటున్నారు నిపుణులు.

హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీలోనే..

నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అధికారిక లేదా ప్రాంతీయ భాషలనే మాధ్యమంగా వాడాలని సదరు కమిటీ తన సిఫారసుల్లో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లో హిందీని చేర్చాలని డిమాండ్ చేసింది. ఏ–కేటగిరీ రాష్ట్రాల్లో హిందీకి నూటికి నూరుశాతం ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో హిందీ మీడియంలో బోధన సాగాలని చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో బోధించాలని సూచించింది.

రోడ్లకు పేర్లు మార్చినంత సులభంగా..

ఇటీవల బీజేపీ హయాంలో పట్టణాలు, రోడ్లకు పేర్లు మార్చేస్తున్నారు. ఇంగ్లిష్ పేర్లంటే అస్సలు పడటంలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఇంగ్లిష్ మీడియంపై కూడా కేంద్రం కన్నెర్ర చేస్తోంది. దీనివల్ల ఎవరికి లాభం, ఏంటి లాభం అనేది తెలియడంలేదు. బీజేపీ మాత్రం మొండిగా ముందుకెళ్లాలనుకుంటోంది. పార్లమెంట్ కమిటీ సిఫారసులను అమలులో పెట్టడానికి కేంద్రం ఏమాత్రం ఆలోచించదనే విషయం తెలిసిందే. అయితే ఈ సాహసం ఎప్పటిలోగా పట్టాలెక్కుతుందనేదే తేలాల్సి ఉంది.

First Published:  10 Oct 2022 2:15 AM GMT
Next Story