Telugu Global
National

ఆజాద్ కి మద్దతుగా జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కు మరో 42 మంది నేతల రాజీనామా

కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన గులామ్ నబీ ఆజాద్ కు మద్దతుగా జమ్ము కశ్మీర్ లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నిన్న కా‍గ్రెస్ పార్టీకి 65 మంది రాజీనామా చేయగా ఈ రోజు మరో 42 మంది రాజీనామా చేశారు.

ఆజాద్ కి మద్దతుగా జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కు మరో 42 మంది నేతల రాజీనామా
X

కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కి మద్దతుగా జమ్మూ కాశ్మీర్ లో మరో 42 మంది నేతలు రాజీనామా చేశారు. ఆజాద్ ఏర్పాటు చేసే కొత్త పార్టీలో తామంతా చేరుతామని వారు ప్రకటించారు. నిన్న దాదాపు 65 మంది రాజీనామా చేసి సంచలనం సృష్టించగా ఇవాళ వీరు కూడా అదేబాటలో నడిచారు. వీరి చర్యతో జమ్మూ కాశ్మీర్ లో పార్టీని వీడినవారి సంఖ్య వందకు పైగా పెరిగింది. వీరిలో మాజీ డిప్యూటీ సీఎం తరన్ చంద్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి ఎన్నికలు జరగవచ్చునని ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ.. తాము మొత్తం 90 సీట్లకూ పోటీ చేస్తామని ఈ మాజీ కాంగ్రెసువాదులు తెలిపారు. సెప్టెంబరు 4 న జమ్మూలో ఆజాద్ నిర్వహించే భారీ ర్యాలీలో మేమంతా పాల్గొంటాం.. కాంగ్రెస్ పార్టీకి మా సత్తా చూపుతాం అని వెల్లడించారు. అదే రోజున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఢిల్లీలో ' మెహంగాయ్ పర్ హల్లా బోల్' పేరిట పెద్ద ర్యాలీయే నిర్వహిస్తుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జమ్మూ సభలో ఆజాద్ తన కొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పై పోరాటానికి ఇది నాంది అవుతుందని ఆజాద్ ఇదివరకే గర్జించారు.

ఆజాద్ ని కలిసిన జీ-23 టాప్ లీడర్స్

ఒకనాడు కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించి సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది అసమ్మతి నేతలు మళ్ళీ ఒక్కటవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జీ-23 గ్రూప్ గా వీరు పాపులర్ అయ్యారు. ఈ బృందంలోని భూపేందర్ సింగ్ హుడా, ఆనంద్ శర్మ, పృథ్వీ రాజ్ చవాన్ .. ఢిల్లీలో నిన్న గులాం నబీ ఆజాద్ తో భేటీ అయ్యారు. పార్టీలోని ప్రస్తుత పరిణామాలను, భవిష్యత్తులో తమ గ్రూప్ అనుసరించే వ్యూహం గురించి వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నిక, ఈ పోస్టుకు రేసులో తాను ఉండే అవకాశాలున్నాయంటూ తమ బృందంలోని సీనియర్ నేత శశిథరూర్ చేసిన ప్రకటన కూడా వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. అక్టోబరు 17 న పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నికలో ఏకాభిప్రాయంతో తమ గ్రూపులో ఒకరిని ఎన్నుకోవాలన్నది వీరి ఆలోచనగా కనబడుతోంది. ఇదే సమయంలో పృథ్వీరాజ్ చవాన్ సైతం రేసులో ఉండవచ్చునన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న తరుణంలో.. జీ-23 నేతల ప్రతిపాదనలు, నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. సోనియా గాంధీ చాయిస్ ని (గెహ్లాట్) వీరు అంగీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక గులాం నబీ ఆజాద్, పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మధ్య ట్విటర్ వార్ రోజురోజుకీ హీటెక్కుతోంది.




First Published:  31 Aug 2022 8:46 AM GMT
Next Story