Telugu Global
National

ఢిల్లీలో ఫేక్ బాంబ్ లు.. లైట్ తీసుకున్న స్థానికులు, పోలీసులు..

ఇంతకీ ఢిల్లీలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చేపట్టిన ఆ ఆపరేషన్ ఏంటి..? మీరే చదవండి..

ఢిల్లీలో ఫేక్ బాంబ్ లు.. లైట్ తీసుకున్న స్థానికులు, పోలీసులు..
X

ఢిల్లీలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చేపట్టిన ఓ ఆపరేషన్ అక్కడి భద్రతా వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. పక్కనే అనుమానిత వస్తువులు కనపడుతున్నా ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని తేలింది. ప్రజలే కాదు, కనీసం పోలీసులు, స్థానిక సెక్యూరిటీ కూడా ఏమాత్రం అప్రమత్తంగా లేరని అర్థమవుతోంది. ఇంతకీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చేపట్టిన ఆ ఆపరేషన్ ఏంటి..? మీరే చదవండి..

ఆల్ ఖైదా తీవ్రవాదుల నుంచి సూసైడ్ బాంబ్ అటాక్ లు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీలో జనసమ్మర్దంగా ఉండే కొన్ని ప్రాంతాలను వారు టార్గెట్ చేసుకున్నారని సమాచారం. అయితే ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఓ ఆపరేషన్ చేపట్టింది. అసలు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారు, స్థానిక సెక్యూరిటీ గార్డ్ లు, పోలీస్ సిబ్బంది ఎంత అలర్ట్ గా ఉన్నారనే విషయాన్ని టెస్ట్ చేయాలనుకుంది. జూన్ నుంచి ఇప్పటి వరకూ ఢిల్లీలో 30 చోట్ల ఫేక్ బాంబులు పెట్టింది. విచిత్రం ఏంటంటే వాటిలో కేవలం 12 మాత్రమే స్థానికులు గుర్తించగలిగారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు మిగతా 18 ఫేక్ బాంబుల్ని ఎవరూ గుర్తించలేదు. అంటే.. ఒకవేళ ఆయా ప్రాంతాల్లో నిజమైన బాంబులు పెట్టినా ప్రమాదం జరిగేందుకు 100 % ఆస్కారం ఉందన్నమాట.

స్పెషల్ పోలీస్ కమిషనర్ హరగోబింగ్ సింగ్ ధలివాలా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. జూన్ 12న 15 ప్రాంతాల్లో ఫేక్ ఎల్ఈడీ బాంబుల్ని పెట్టారు. వాటిలో పదింటిని స్థానిక ప్రజలు, సెక్యూరిటీ సిబ్బంది గుర్తించగలికారు. జూన్ 28న మరో 15 ప్రాంతాల్లో ఫేక్ బాంబుల్ని పెట్టగా కేవలం రెండు చోట్ల మాత్రమే వాటిని గుర్తించారు. పూలకుండీలు, చెత్తకుండీలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఉంచినా ప్రజలెవరూ గుర్తించలేదు, వారి పని వారు చూసుకుని వెళ్లిపోయారు. కనీసం అనుమానితంగా సంచరిస్తూ అక్కడ ఓ వస్తువు వదిలిపెట్టి వెళ్లినా కూడా ప్రజలు పట్టించుకోవట్లేదనే విషయం స్పష్టమైంది. పోలీసులు 24గంటలు నిఘా పెట్టినా.. కనీసం ప్రజల్లో అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. కానీ ప్రజలనుంచి ఆ స్థాయిలో స్పందన లేదు, జాగ్రత్త కూడా లేదు.

First Published:  14 July 2022 5:37 AM GMT
Next Story