Telugu Global
National

బూట‌కపు ఎన్ కౌంటర్ లో అమాయకులను చంపిన ఆర్మీ అధికారికి జీవితఖైదు

ఆ ముగ్గురు ఉగ్రవాదులు కాదని వారిని ఆర్మీ పట్టుకెళ్ళి కాల్చి చంపిందని వారి కుటుంబాలే కాకుండా స్థానికులు కూడా నిరసనలు తెలిపారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సంఘటనపై స్పందించారు.

బూట‌కపు ఎన్ కౌంటర్ లో అమాయకులను చంపిన ఆర్మీ అధికారికి జీవితఖైదు
X

జూలై 18, 2020 న జమ్మూ లోని షోపియాన్ జిల్లా అంశీపొరా గ్రామంలో ఇంతియాజ్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, మహ్మద్ ఇబ్రార్ అనే ముగ్గురు యువకులను ఉగ్రవాదులు అని ముద్ర వేసి ఆర్మీ కాల్చి చంపింది. దీనికి నాయకత్వం వహించింది కెప్టెన్ భూపేంద్ర సింగ్.

ఆ ముగ్గురు ఉగ్రవాదులు కాదని వారిని ఆర్మీ పట్టుకెళ్ళి కాల్చి చంపిందని వారి కుటుంబాలే కాకుండా స్థానికులు కూడా నిరసనలు తెలిపారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సంఘటనపై స్పందించారు. ఈ ఘటన‌ జరిగిన వెంటనే J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజౌరిలో బాధిత కుటుంబీకులను సందర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిని ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని వారికి అందించారు.

ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, ఆర్మీ కెప్టెన్ భూపేంద్ర సింగ్ సహా ముగ్గురిపై చార్జిషీటు దాఖలు చేశారు. మరో వైపు ఆర్మీ కోర్టు కూడా దీనిపై విచారణ చేసి కెప్టెన్ భూపేంద్ర సింగ్ కు జీవితఖైదు విధించాలని ఈ రోజు సిఫారసు చేసింది. యావజ్జీవ శిక్షను ఆర్మీ ఉన్నతాధికారులు ధృవీకరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (AFSPA) కెప్టెన్ భూపేంద్ర సింగ్ నాయకత్వంలో దళాలు దుర్వినియోగం చేశాయని ఆర్మీ కోర్టు పేర్కొంది.

కెప్టెన్ భూపేంద్ర సింగ్ కు సహకరించిన సాధారణ పౌరులైన‌ మరో ఇద్దరు నిందితులు తబీష్ నజీర్, బిలాల్ అహ్మద్ లోన్ లు నగదు బహుమతుల కోసం నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని, ఎన్ కౌంటర్ తర్వాత సాక్ష్యాలను నాశనం చేసారని పోలీసులు తమ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. వారిపై కోర్టులో విచారణ సాగుతున్నది.

First Published:  6 March 2023 2:18 PM GMT
Next Story