Telugu Global
National

ఆయనకు ప్రధాని కావాలనే కోరిక ఉంది.. అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

నితీష్, లాలూ బీహార్ కు వెనుకబాటు తనాన్ని దూరం చేయలేరని, బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు అమిత్ షా.

ఆయనకు ప్రధాని కావాలనే కోరిక ఉంది.. అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు
X

విపక్షాల్లో ప్రధాని కావాలనే కోరిక ఎవరికి ఉందో, ఎవరికి లేదో తెలియదు కానీ.. బీజేపీ మాత్రం విపక్షాల్లో అందరూ ప్రధాని అభ్యర్థులేనంటోంది. రాహుల్ గాంధీకి పోటీగా అందరి పేర్లు బీజేపీయే తెరరైకి తెస్తుంది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పేరుని తెరపైకి తెచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ప్రధాని కల నెరవేర్చుకోడానికి నితీష్ చాలా ప్రయత్నాలు చేశారని, అవేవీ నెరవేరలేదని, భవిష్యత్తులో కూడా ఆయన ప్రధాని కాబోరని అన్నారు.

బీహార్‌ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా నితీష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తన ప్రధాని కలను నెరవేర్చుకునేందుకే.. బీజేపీతో పొత్తు కాదనుకుని నితీష్.. కాంగ్రెస్, ఆర్జేడీతో చేరారని చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ను బీహార్ ముఖ్యమంత్రి చేయడానికి జేడీయూ అధిష్టానం అంగీకరించిందని ఆరోపించారు. బీహార్ రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’గా మార్చేశారని విమర్శలు గుప్పించారు. నితీష్ కి శాశ్వతంగా బీజేపీ తలుపులు మూసేశామన్నారు. జయ్ ప్రకాశ్ నారాయణ్ తన జీవితాంతం కాంగ్రెస్, జంగిల్ రాజ్ కు వ్యతిరేకంగా పోరాడారని.. కానీ నితీష్ తన అవసరాల కోసం సోనియాగాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ తో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.

నితీష్ కుమార్ వికాసవాది కాదని, అవకాశవాది అని సెటైర్లు వేశారు అమిత్ షా. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కన్నా ఎక్కువ స్థానాలు సాధించిందని, కానీ సీఎం కుర్చీలో నితీష్ ని కూర్చోబెట్టామని, అయినా కూడా ఆయన అవకాశవాద రాజకీయాలు చేశారని చెప్పారు. ‘ఆయా రామ్‌, గయారామ్‌’ ఇక చాలని, నితీష్ కి బీజేపీ శాశ్వతంగా తలుపులు మూసేసిందని అన్నారు. నితీష్, లాలూ బీహార్ కు వెనుకబాటు తనాన్ని దూరం చేయలేరని, బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. 2024లో సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీని మూడింట రెండొంతుల మెజారిటీతో మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు అమిత్ షా.

First Published:  25 Feb 2023 12:37 PM GMT
Next Story