Telugu Global
National

తప్పని సరి పరిస్థితుల్లోనే వాళ్ళు రేప్ చేశారంటారా అమిత్ షా గారూ

గుజరాత్ లో నిన్న అమిత్ షా మాట్లాడిన మాటల టార్గెట్ ఏంటి ? గుజరాత్ ప్రభుత్వం జైలు నుండి విడిచిపెట్టిన ఆ 11 మంది రేపిస్టులను సమర్ధించడానికే ఆ మాటలు మాట్లాడారా ?

తప్పని సరి పరిస్థితుల్లోనే వాళ్ళు రేప్ చేశారంటారా అమిత్ షా గారూ
X

కేంద్ర హోం మంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా చాలా గొప్ప మాటలు చెప్పారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మూడు రోజుల పాటు జరగనున్న 6వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ చెప్పినట్టు మనుషులకు వేసే శిక్ష పరివర్తన తీసుకొచ్చే విధంగా ఉండాలని అమిత్ షా వక్కాణించారు. అంతటితో ఆగలేదాయన 'జైలులో ఉన్న ప్రతి వ్యక్తి పుట్టుకతో నేరస్థుడు కాదు, కొన్నిసార్లు పరిస్థితుల ప్రోద్బలంతో ఆయా ఘటనల్లో వారి ప్రమేయం తప్పనిసరి అవుతుంది'' అన్నారాయన. దాంతో శిక్షలకు గురి కావాల్సి వస్తుంది. అందువల్ల అటువంటి వారిని మంచిగా తీర్చి దిద్ది మళ్ళీ సమాజంలోకి తీసుకురావాల్సిన బాధ్యత జైలు అధికారులది అన్నారు అమిత్ షా.

ఈ మాటలు వింటూ వుంటే అమిత్ షా ఆలోచించే విధానం ఎంత గొప్పగా అనిపిస్తుందో కదా ! అయితే ఈ మాటల నేపథ్యం వేరే ఉంది. ఆ నేపథ్యాన్ని తెలుసుకోకుండా ఈ మాటలు వింటే నేరస్తుల్లో పరివర్తన తీసుకరావ‌డానికి నడుం భిగించిన మహానుబావుడిగా అనిపిస్తారు అమిత్ షా.

గుజరాత్ లో 2002 లో జరిగిన మత దాడుల్లో బిల్కిస్ బానో అనే గర్భవతిపై సాముహిక అత్యాచారం చేసి ఆమె ఏడుగురు బంధువులను హత్య చేసిన 11 మంది రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15 సందర్భంగా జైలు నుండి విడుదల చేసింది. ఆ నేపథ్యంలో అదే గుజరాత్ లో అమిత్ షా మాట్లాడారు.

రేపిస్టుల విడుదల పట్ల దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. స్వంత పార్టీ నేతలు కూడా కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ రేపిస్టులను మళ్ళీ జైలుకు పంపాలంటూ సుప్రీం కోర్టులో పలువురు కేసుకూడా వేశారు. ఆ 11 మంది రేపిస్టులను విడుదల చేయడాన్ని సమర్ధించుకోవడానికి బీజేపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా మాట్లాడిన మాటల వెనక‌ అసలు లక్ష్యమేంటో అర్దమవుతుంది కదా!

''జైలులో ఉన్న ప్రతి వ్యక్తి పుట్టుకతో నేరస్థుడు కాదు, కొన్నిసార్లు పరిస్థితుల ప్రోద్బలంతో ఆయా ఘటనల్లో వారి ప్రమేయం తప్పనిసరి అవుతుంది'' అన్న అమిత్ షా మాటలను ఆ 11 మంది రేపిస్టులను దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. బిల్కిస్ బానో ను దుర్మార్గంగా అత్యాచారం చేసిన దుర్మార్గులు అమిత్ షా మాటల్లో ఏ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చేసుంటారు?

''అటువంటి వారిని మంచిగా తీర్చి దిద్ది మళ్ళీ సమాజంలోకి తీసుకురావాల్సిన బాధ్యత జైలు అధికారులది'' అని అమిత్ షా అన్న మాటల్లో జైల్లో నుంచి బైటికి తీసుకరావడమొక్కటే నిజమైంది. ఆ 11 మంది రేపిస్టులు మానసిక పరివర్తన చెందారా ? వాళ్ళు జైలు నుంచి బైటికి రాగానే వాళ్ళు చేసిన గొప్ప పనిని కీర్తిస్తూ సన్మానాలు జరిగాయి. వేడుకలు చేసుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆ దోషులు వాళ్ళు చేసిన పనికి ఎక్కడా కనీసం పశ్చాత్తాపం ప్రకటించలేదు. వాళ్ళు బైటికొచ్చి చేసిన హడావుడికి భయపడి ఆ గ్రామంలోని ముస్లిం కుటుంబాలన్ని గ్రామం విడిచి పారిపోయాయి.

ఇటువంటి వాళ్ళను మనం నేరస్తులుగా చూడొద్దు...పరిస్థితుల ప్రభావంతో పాపం రేప్ చేశారని మనం నమ్మాలి. వాళ్ళను ప్రభుత్వం జైలు నుండి విడుదల చేస్తే పాపం పరిస్థితులు చేసిన తప్పుకు వాళ్ళను బలిచేయడమెందుకని మనం సాదరంగా ఆహ్వానించాలి.... ఇప్పుడు మనం ఆ రేపిస్టులకు జైకొట్టాలి.. ఇదేనా అమిత్ షా గుజరాత్ లో ఇచ్చిన ఉపన్యాసానికి అర్థం... పరమార్థం

First Published:  5 Sep 2022 6:26 AM GMT
Next Story