Telugu Global
National

స‌హ‌జీవ‌నంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

18 ఏళ్ల లోపు ఉన్న ఒక అబ్బాయి.. తనకంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణం వల్ల నేర విచారణ నుంచి అతనికి రక్షణ ఉండదని, వారి చర్యలు చట్టపరమైనవి కాదని ధర్మాసనం తెలిపింది.

స‌హ‌జీవ‌నంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
X

ఇటీవ‌ల కాలంలో స‌హ‌జీవ‌నం చేస్తున్న జంట‌ల‌ సంఖ్య పెరుగుతోంది. న‌గ‌రాల్లోనే ఈ ప‌రిస్థితి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్రేమలో ఉన్నవారు తమ గురించి తాము పూర్తిగా అర్థం చేసుకునేందుకు.. అనే పేరుతో ఈ కొత్త సంస్కృతికి తెర తీస్తున్నారు. ఇటీవ‌ల 18 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న మైన‌ర్లు కూడా స‌హ‌జీవ‌నం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. లివ్ ఇన్ రిలేష‌న్ పేరుతో కొన‌సాగుతున్న ఈ స‌హ‌జీవ‌నాల‌పై అల‌హాబాద్ హైకోర్టు తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

18 ఏళ్ల లోపు వ‌య‌సు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధమని, అనైతికమని తేల్చి చెప్పింది. సహజీవనాన్ని వివాహపరమైన బంధంగా పరిగణించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని కోర్టు స్ప‌ష్టం చేసింది. 18 ఏళ్ల లోపు ఉన్న ఒక అబ్బాయి.. తనకంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణం వల్ల నేర విచారణ నుంచి అతనికి రక్షణ ఉండదని, వారి చర్యలు చట్టపరమైనవి కాదని ధర్మాసనం తెలిపింది.

ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి ఇంట్లో నుంచి బ‌య‌టికొచ్చేసి.. ప్ర‌యాగ్‌రాజ్‌లో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. యువ‌తి క‌నిపించ‌క‌పోవ‌డంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించిన ఆమె కుటుంబ‌స‌భ్యులు.. వారి ఆచూకీ గుర్తించిన అనంత‌రం వారిద్ద‌రినీ బ‌ల‌వంతంగా త‌మ గ్రామానికి తీసుకెళ్లారు. అయితే వారి నుంచి త‌ప్పించుకున్న యువ‌తి ఈ విష‌యాన్ని అబ్బాయి తండ్రికి తెలియ‌జేసింది. దీంతో ఆయన కోర్టును ఆశ్ర‌యించారు. ఆ అబ్బాయిపై ఎలాంటి క్రిమినల్ చర్యలూ తీసుకోకుండా రక్షించాలని యువ‌తి కూడా మరో పిటిషన్ దాఖలు చేసింది.

తాజాగా వీటిపై విచార‌ణ జ‌రిపిన అలహాబాద్ హైకోర్టు 18 ఏళ్ల లోపు ఉన్నవారు సహజీవనం చేయడం అనైతికమని పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా జీవించే హక్కు ఉంటుందని.. కానీ వాళ్లు మేజర్ అయి ఉండాలని ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిపై ఆరోపించిన నేరానికి ఎలాంటి ఆధారాలూ కోర్టుకు సమర్పించలేదు. దీంతో నేరం జరిగిందనే అభిప్రాయానికి రాలేమని కోర్టు పేర్కొంది. ఈ సంఘటనపై మరింత విచారణ చేయాలని అధికారుల‌ను న్యాయ‌స్థానం ఆదేశించింది.

First Published:  2 Aug 2023 4:01 PM GMT
Next Story