Telugu Global
National

మద్యం తాగి చనిపోతే ఆ కుటుంబాల బాధ్యత ప్రభుత్వానిదే..

షాపు యాజమాన్యం నామమాత్రపు సాయం చేసి చేతులు దులిపేసుకుంది. అటు ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించలేదు సరికదా పరిహారం ఇవ్వడం తమ బాధ్యత కాదని తప్పించుకుంది.

మద్యం తాగి చనిపోతే ఆ కుటుంబాల బాధ్యత ప్రభుత్వానిదే..
X

మద్యంపై వచ్చే ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వమే షాపుల ద్వారా మద్యం అమ్ముతోంది. మరి మద్యం తాగి చనిపోయినవారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదా, ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోదా..? వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనంటూ తీర్పుచెప్పింది అలహాబాద్ హైకోర్టు. మద్యం తాగి మరణించినవారి కుటుంబాలకు పరిహారం అందించకుండా తప్పించుకోవడం సరికాదంటూ యూపీ సర్కారుకి చీవాట్లు పెట్టింది.

2021లో యూపీలోని అజాంఘర్ లో కల్తీ మద్యం తాగి 10మంది చనిపోయారు, ఒకరు శాశ్వతంగా గుడ్డివారిగా మారిపోయారు. వీరంతా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన లైసెన్స్‌డ్‌ దుకాణంలోనే మద్యం బాటిళ్లు కొన్నారు. కానీ అది కల్తీది కావడంతో మోసపోయారు. పదిమంది ప్రాణాలు పోయాయి, ఒకరికి అంధత్వం ప్రాప్తించింది. బాధిత కుటుంబాలు పరిహారం కోరాయి. షాపు యాజమాన్యం నామమాత్రపు సాయం చేసి చేతులు దులిపేసుకుంది. అటు ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించలేదు సరికదా పరిహారం ఇవ్వడం తమ బాధ్యత కాదని తప్పించుకుంది.

బాధిత కుటుంబాలు పట్టువదల్లేదు. చనిపోయినవారిలో 9 మంది భార్యలు, మరొకరి కుమారుడు, చూపు కోల్పోయిన వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. తమకు నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశారు. మద్యం తాగి చనిపోతే దానికి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమాధానమిచ్చారు. కానీ కోర్టు మాత్రం చీవాట్లు పెట్టింది. మద్యంపై ఆదాయం తీసుకోవడం ఇష్టమున్నప్పుడు మద్యం వల్ల కలిగిన మరణాలకు బాధ్యత వహించడం ఎందుకు కష్టంగా మారిందని ప్రశ్నించింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.

First Published:  2 Sep 2022 11:08 AM GMT
Next Story