Telugu Global
National

దలైలామాకు 'భారతరత్న' పురస్కారం ఇవ్వాల్సిందే.. ఎంపీల ఫోరమ్ డిమాండ్

దలైలామాకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలని అఖిలపక్ష భారత ఎంపీల ఫోరమ్ డిమాండ్ చేసింది.ఈ మేరకు బిజూజనతాదళ్ కు చెందిన ఎంపీ సుజిత్ కుమార్ ఆధ్వర్యంలోని ఈ ఫోరమ్ కేంద్రానికి లేఖ రాసింది.

దలైలామాకు భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందే.. ఎంపీల ఫోరమ్ డిమాండ్
X

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది బౌద్దులకు ఆరాధ్యుడైన దలైలామా.. మహాత్మా గాంధీ మార్గంలో టిబెట్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న 'అలుపెరుగని యోధుడు'.. శాంతి, అహింస ఆయన 'ఆయుధాలు'.. టిబెటన్ల ఆధ్యాత్మిక బౌద్ధ గురువైన ఆయనకు ప్రభుత్వం అత్యున్నత 'భారతరత్న' పురస్కారాన్ని ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. టిబెట్ వ్యవహారాలకు సంబంధించిన అఖిలపక్ష భారత ఎంపీల ఫోరమ్ ఇటీవల ఈ డిమాండును ప్రభుత్వ దృష్టికి తెచ్చింది. 'భారతరత్న' అవార్డును పొందడానికి ఆయన అన్నివిధాలా అర్హుడని, అందువల్ల ఆయనను ఈ పురస్కారంతో సత్కరించాలంటూ తాము ఖరారు చేసిన తీర్మానాలను ఈ ఫోరమ్ కేంద్రానికి పంపింది. చైనా నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా.. ఫోరమ్ సభ్యులు బెదరలేదు. గత ఏడాది రెండోసారి తాము నిర్వహించిన సమావేశంలో వీటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. పాలక బీజేపీకి చెందిన సభ్యులతో బాటు జేడీ-యూ, బిజూజనతాదళ్ తదితర పార్టీల ఎంపీలు .. దలైలామా విషయంలో తమ సమైక్య గళాన్ని వినిపించారు.

ఈ బౌద్ధ గురువు విషయంలో జోక్యం చేసుకునే హక్కు చైనాకు లేదని, టిబెటన్లదే నిర్ణయాధికారమని వీరు స్పష్టం చేశారు. 10 మంది సభ్యులున్న ఫోరమ్ లో బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీ సుశీల్ మోడీ, అశోక్ బాజ్ పాయ్, లహార్ సింగ్ సిరోయా, వినయ్ దీనూ టెండూల్కర్, లోక్ సభ ఎంపీలు తాపిర్ గావో, రాజేంద్ర అగర్వాల్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. దలైలామాకు భారతరత్న అవార్డును ప్రకటించేముందు పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరచాలని వీరు లోక్ సభ స్పీకర్ కి, రాజ్యసభ చైర్మన్ కు లేఖలు రాశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో దలైలామా ప్రసంగించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. దలైలామాకి , టిబెట్ కి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించాలని అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన తాపిర్ గావో సూచించారు.

అంతేకాదు.. పార్లమెంటు లోపల, బయట ఎంపీలంతా టిబెట్ సమస్యపై గళమెత్తాలని బిజూజనతాదళ్ కు చెందిన ఎంపీ సుజిత్ కుమార్ ఆధ్వర్యంలోని ఈ ఫోరమ్ పిలుపునిచ్చింది. దలైలామా విషయంలో మా డిమాండుకు సంబంధించి సంతకాల ఉద్యమాన్ని చేపట్టాం.. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. చాలామంది ఎంపీలు వీడియో సందేశాలు కూడా పంపారు అని సుజిత్ కుమార్ తెలిపారు. మా మొదటి సమావేశంలో.. చైనా ఎంబసీ మమ్మల్ని హెచ్చరిస్తున్నట్టు ప్రకటనలు చేసింది. అయినా మేం పట్టించుకోలేదు అని చెప్పారు. 'టిబెట్ ని సమర్థిస్తూ అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఓ బిల్లును ప్రతిపాదించింది, మన భారత పార్లమెంటులోనూ ఇలాంటి బిల్లును తేవాలని మేం కోరుతున్నాం' అని ఫోరమ్ సభ్యులు కోరారు. 2014 లో టిబెట్ రీహాబిలిటేషన్ పాలసీని నాటి కేంద్ర హోమ్ శాఖ ప్రకటించిందని, దీనిపై తాము చర్చించామని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో టిబెట్ లోని పునరావాస శిబిరాలను సందర్శించి.. శరణార్ధుల సమస్యలు తెలుసుకోవాలని ఈ బృంద సభ్యులు అభిప్రాయపడ్డారు. శరణార్థులు ఆక్రమించుకున్న భూమి వారికే చెందేలా 20 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలన్న రీహాబిలిటేషన్ పాలసీ సముచితంగా ఉంది.. వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని తాము కోరుతున్నామని ఫోరమ్ వెల్లడించింది. టిబెటన్ల సెటిల్మెంట్ల చుట్టూ రోడ్లు, విద్యుదీకరణ, మంచినీటి సౌకర్యాలవంటివి ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్ వేరవేరగలదన్న ఆశాభావాన్ని సభ్యులు వ్యక్తం చేశారు.

1989 లో నోబెల్ శాంతి బహుమతిని పొందిన దలైలామాకు 'భారతరత్న' పురస్కారాన్ని ప్రకటించడంలో ప్రభుత్వం ఇప్పటికే జాప్యం చేసిందని వారు అభిప్రాయపడ్డారు. ప్రవాస టిబెట్ ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన ఆయన విషయంలోకేంద్రం చొరవ తీసుకోవాలని వీరు కోరుతున్నారు. శాంతికి, అహింసకు ఇస్తున్న అవార్డుగా దీన్ని పరిగణించాలని ఫోరమ్ పేర్కొంది. టిబెట్ ప్రవాస ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పని చేస్తోంది.

First Published:  18 Aug 2022 7:29 AM GMT
Next Story