Telugu Global
National

సమాజాన్ని సేవ వైపు నడిపే లక్ష్యంతో.. బతికుండగానే వర్ధంతి జరుపుకొంటున్న వృద్ధుడు

బతికి ఉండగానే తన వర్ధంతిని తానే చేసుకోవడంపై భజన్ సింగ్ మాట్లాడుతూ కలియుగంలో దానధర్మాలు చేసేవారు లేరని చెప్పాడు. గతంతో పోలిస్తే లేనివారికి సాయపడేవారు క్రమేపీ తగ్గిపోతూ వస్తున్నారని తెలిపాడు.

సమాజాన్ని సేవ వైపు నడిపే లక్ష్యంతో.. బతికుండగానే వర్ధంతి జరుపుకొంటున్న వృద్ధుడు
X

కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి చనిపోయిన రోజును వర్ధంతిగా జరుపుకొంటూ ఉంటాం. వారి జ్ఞాపకార్థం ఆరోజు సహాయాలు చేస్తుంటాం. కొంతమంది తమ శక్తి కొద్దీ అన్నదానం చేస్తుంటారు. మరి కొంతమంది అనాథ, వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడివారికి భోజనాలు పెట్టడం, దుస్తులు పంపిణీ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే బతికి ఉండగా వర్ధంతిని జరుపుకోవడం ఎక్కడా చూసి ఉండం. కానీ పంజాబ్ రాష్ట్రం ఫతేగడ్ జిల్లా మజ్రి సోధియా గ్రామానికి చెందిన భజన్ సింగ్ బతికి ఉండగానే తన వర్ధంతిని తానే జరుపుకొంటున్నాడు. ఆయన తన వర్ధంతిని తానే జరుపుకోవడం ప్రారంభించి ఐదేళ్లయ్యింది.

ఆ రోజు ఆయన తనకు చేతనైన సహాయాన్ని ప్రజలకు అందజేస్తుంటాడు. భజన్ సింగ్ ఓ మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తాజాగా ఆయన తన ఐదవ వర్ధంతిని జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఐదుగురు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశాడు. అలాగే 11 మంది బాలికలకు భోజనాలు పెట్టాడు.

బతికి ఉండగానే తన వర్ధంతిని తానే చేసుకోవడంపై భజన్ సింగ్ మాట్లాడుతూ కలియుగంలో దానధర్మాలు చేసేవారు లేరని చెప్పాడు. గతంతో పోలిస్తే లేనివారికి సాయపడేవారు క్రమేపీ తగ్గిపోతూ వస్తున్నారని తెలిపాడు. సమాజాన్ని సేవ వైపు తీసుకెళ్లేందుకు, వారిని అప్రమత్తం చేసేందుకు తన వర్ధంతిని తానే జరుపుకొంటున్నట్లు వెల్లడించాడు. తనని చూసి కొంతమంది అయినా మారతారనే నమ్మకంతో ఐదేళ్ల నుంచి తన వర్ధంతిని తానే చేసుకుంటున్నట్లు భజన్ సింగ్ తెలిపాడు. మామూలుగా వర్ధంతి సమయంలో జరిగే సంప్రదాయ పూజలు కూడా ఈ సందర్భంగా భజన్ సింగ్ కుటుంబ సభ్యులు జరపడం ఆశ్చర్యం కలిగించింది.

First Published:  31 Jan 2023 7:21 AM GMT
Next Story