Telugu Global
National

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు మరో షాక్.. ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పుకున్న అజయ్ మాకెన్

డిసెంబర్ 4న రాజస్థాన్‌లో ఉపఎన్నిక జరుగనుందని, అలాగే భారత్ జోడో యాత్ర కూడా రాష్ట్రంలోకి ప్రవేశించినున్నది. కాబట్టి త్వరగా కొత్త ఇంచార్జిని నియమించాలని మాకెన్ లేఖలో కోరారు.

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు మరో షాక్.. ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పుకున్న అజయ్ మాకెన్
X

రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత సచిన్ పైలెట్ మధ్య ఉన్న విభేదాలు తీర్చడం తన వల్ల కాదని, వీరి వివాదం పరిష్కరించడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోలేనని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అజయ్ మాకెన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం అశోక్ గెహ్లాట్ విధేయులపై చర్యలు తీసుకోవడంలో అధిష్టానం విఫలం అవడంపై మాకెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో రెండు వారాల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించనున్న సమయంలో మాకెన్ రాజీనామా పార్టీలో కలకలం రేపుతోంది.

నవంబర్ 8న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు మాకెన్ లేఖ రాశారు. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం చేకూరుస్తుందని, త్వరగా వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. మరోవైపు సచిన్ పైలెట్ కూడా కొద్ది రోజుల క్రితం రాష్ట్ర పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మాకెన్ రాజీనామా అధిష్టానానికి సరికొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. డిసెంబర్ 4న రాజస్థాన్‌లో ఉపఎన్నిక జరుగనుందని, అలాగే భారత్ జోడో యాత్ర కూడా రాష్ట్రంలోకి ప్రవేశించినున్నది. కాబట్టి త్వరగా కొత్త ఇంచార్జిని నియమించాలని మాకెన్ లేఖలో కోరారు.

కాగా, తాను పార్టీ నుంచి వైదొలగడం లేదని మాకెన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ భావజాలంతో తమ కుటుంబానికి ఎంతో సంబంధం ఉందని, మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నామని మాకెన్ పేర్కొన్నారు. తాను ఎప్పటికీ రాహుల్ గాంధీకి అనుచరుడిగా ఉంటానని తెలిపారు. రాబోయే రోజుల్లో సొంత రాష్ట్రం ఢిల్లీలో కాంగ్రెస్ బలపడేందుకు కృషి చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు.

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయాలని అధిష్టానం భావించింది. ఆయన కూడా అధ్యక్ష పదవి బరిలో ఉంటానని ప్రకటించారు. అదే సమయంలో సీఎం పదవిని వదిలేయాలని రాహుల్ గాంధీ సూచించారు. అశోక్ గెహ్లాట్ సీఎంగా దిగిపోతే.. ఆయన స్థానంలో సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. దీంతో అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేసినా.. సదరు ఎమ్మెల్యేలు రాకుండా.. వేరే చోట సమావేశమయ్యారు. ఇవన్నీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో అశోక్ గెహ్లాట్‌ను అధ్యక్ష పదవికి పోటీ పడకుండా ఆపింది.

కానీ అప్పటి నుంచి రాజస్థాన్ కాంగ్రెస్‌లో విభేదాలు మాత్రం తగ్గలేదు. అప్పటి సంక్షోభం వెనుక గెహ్లాట్ అనుచరులైన ముగ్గురు ఎమ్మెల్యేల హస్తం ఉందని తెలిసినా.. అధిష్టానం ఏ చర్యలూ తీసుకోలేదు. దీనిపై సచిన్ పైలెట్ గుర్రుగా ఉన్నారు. అయితే ఇరు వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించడంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అజయ్ మాకెన్ అనేక మార్గాలు వెతికినా.. చివరకు విఫలమయ్యారు. అందుకే చివరకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

First Published:  16 Nov 2022 1:22 PM GMT
Next Story