Telugu Global
National

అయ్యో.. ఎయిర్ ఇండియా టైం అస్సలు బాగోలేదే..!

విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ప్రయాణికుల సీట్లలో కూర్చున్న తన గర్ల్ ఫ్రెండ్ ను పైలెట్ కాక్ పిట్ లోకి ఆహ్వానించాడు. అక్కడే ఆమెకు అన్ని మర్యాదలు చేయడంతో పాటు భోజన ఏర్పాట్లు కూడా చేయించాడు.

అయ్యో.. ఎయిర్ ఇండియా టైం అస్సలు బాగోలేదే..!
X

ఈ మధ్య ఎయిర్ ఇండియా సంస్థ టైం అసలు బాగుండట్లేదు. ఆ సంస్థ విమానాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆ సంస్థ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఒకడేమో ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. మరొకడేమో విమానంలో సిగరెట్ తాగడాన్ని అడ్డుకున్నందుకు ఫ్లైట్ డోర్ తీసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఎయిరిండియా విమానంలో జరిగిన మరో సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రయాణికుల భద్రతను గాల్లోకి వదిలేసిన ఓ పైలెట్ తన గర్ల్ ఫ్రెండ్ ను ఏకంగా ఫ్లైట్ లోని కాక్ పిట్ లోకి తెచ్చుకున్నాడు. ఆమెతో మూడు గంటల పాటు అక్కడే గడిపాడు. ఈ సంఘటన ప్రస్తుతం తీవ్ర దుమారం సృష్టిస్తోంది.

ఫిబ్రవరి 27వ తేదీన దుబాయ్ నుంచి ఢిల్లీకి ఎయిరిండియా విమానం బయలుదేరింది. ఈ విమానంలోనే పైలెట్ గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రయాణించింది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ప్రయాణికుల సీట్లలో కూర్చున్న తన గర్ల్ ఫ్రెండ్ ను పైలెట్ కాక్ పిట్ లోకి ఆహ్వానించాడు. అక్కడే ఆమెకు అన్ని మర్యాదలు చేయడంతో పాటు భోజన ఏర్పాట్లు కూడా చేయించాడు. అభ్యంతరం చెప్పిన విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఏకంగా మూడు గంటల పాటు పైలెట్ తన గర్ల్ ఫ్రెండ్ తో అక్కడే గడిపాడు.

మామూలుగా కాక్ పిట్ లోకి విమానసిబ్బందికి తప్ప ఇతరులకు ప్రవేశం ఉండదు. ప్రయాణికుల భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విమానయానసంస్థలు కాక్ పిట్ లోకి ఇతరులను వెళ్ళనివ్వవు. అయితే సదరు ఎయిరిండియా పైలెట్ మాత్రం నిబంధనలు పట్టించుకోకుండా కాక్ పిట్ లో మూడు గంటలపాటు గర్ల్ ఫ్రెండ్ తో గడిపాడు.

అయితే దీనిపై ఆ రోజు విమానసిబ్బందిలో ఒకరు డీజీసీఏకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎయిరిండియా సంస్థ ప్రకటించింది. దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు డీజీసీఏకు అన్ని వివరాలు చెప్పినట్లు పేర్కొంది. నిజనిర్ధారణ జరిగిన తర్వాత పైలెట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

First Published:  22 April 2023 3:43 AM GMT
Next Story