Telugu Global
National

అన్నాడీఎంకేకు మద్దతు ప్రకటించిన ఎంఐఎం

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను అన్నాడీఎంకే తిరస్కరించిందని ఈ సందర్భంగా ఓవైసీ గుర్తు చేశారు. అందుకే ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు.

అన్నాడీఎంకేకు మద్దతు ప్రకటించిన ఎంఐఎం
X

లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీకి మద్దతు ఇస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఎంఐఎం పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కొన్నేళ్లుగా ఓవైసీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేసింది. అయితే ఈ పార్టీకి ఒక్క బీహార్‌లో తప్ప ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. తమిళనాడు రాష్ట్రంలో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానంలో కూడా ఎంఐఎం గెలవలేకపోయింది.

ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి ఎంఐఎం మద్దతు ప్రకటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని తాజాగా అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను అన్నాడీఎంకే తిరస్కరించిందని ఈ సందర్భంగా ఓవైసీ గుర్తు చేశారు. అందుకే ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు.

తమిళనాడులో అన్నాడీఎంకే వరుసగా రెండుసార్లు విజయం సాధించిన తర్వాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజయం సాధించగా.. అన్నాడీఎంకే కూటమి 75 స్థానాలకే పరిమితం అయింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే బీజేపీకి దగ్గరై ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత బీజేపీతో కలసి ఎన్నికలకు వెళ్లడం వల్లే తాము ఓడిపోవాల్సి వచ్చిందని పలుమార్లు వ్యాఖ్యానించిన అన్నాడీఎంకే ఆ తర్వాత ఆ పార్టీకి దూరం అయ్యింది. లోక్ సభ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు అన్నాడీఎంకేకు లబ్ధి చేకూర్చుతుందని ఆ పార్టీ భావిస్తోంది.

First Published:  13 April 2024 5:19 PM GMT
Next Story