Telugu Global
National

PFIపై బ్యాన్ ను వ్యతిరేకించిన అస‌దుద్దీన్ ఓవైసీ... రైట్ వింగ్ సంస్థలను ఎందుకు నిషేధించలేదని ప్రశ్న‌

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై నిషేధాన్ని MIM అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. రైట్ వింగ్ సంస్థలపై ఎందుకు నిషేధం విధించలేదని ఆయన ప్రశ్నించారు.

PFIపై బ్యాన్ ను వ్యతిరేకించిన అస‌దుద్దీన్ ఓవైసీ... రైట్ వింగ్ సంస్థలను ఎందుకు నిషేధించలేదని ప్రశ్న‌
X

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధాన్ని సమర్థించలేమని ఏఐఎంఐఎం అధినేత. పార్ల‌మెంట్ స‌భ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. "నేను ఎప్పుడూ పిఎఫ్‌ఐ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను. ప్రజాస్వామ్య విధానాన్ని సమర్ధిస్తాను, అయినా పిఎఫ్‌ఐపై ఈ నిషేధాన్ని మాత్రం సమర్ధించలేము" అని ఆయన వరుస ట్వీట్‌లలో పేర్కొన్నారు.

"పిఎఫ్ఐ ఒక్క‌దానినే ఎలా నిషేధిస్తారు. ఖాజా అజ్మేరీ బాంబు పేలుళ్ల దోషులతో సంబంధం ఉన్న సంస్థలను ఎందుకు ఈ జాబితాలో చేర్చ‌లేదు? ప్రభుత్వం మితవాద మెజారిటీ సంస్థలను ఎందుకు నిషేధించడం లేదు?" అని ఓవైసీ ప్ర‌శ్నించారు. యుఎపిఎ చ‌ట్టానికి మ‌రిన్ని కోర‌లు తొడుగుతూ బిజెపి చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా స‌హ‌క‌రించింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. దీనివ‌ల్లే జ‌ర్న‌లిస్టు సిద్ధిఖ్ క‌ప్ప‌న్ కు బెయిల్ వ‌చ్చేందుకు రెండేళ్ళు ప‌ట్టింద‌ని గుర్తు చేశారు.

మంగళవారం నాడు భారతదేశంలోని 15 రాష్ట్రాల్లోని 93 చోట్ల ఎన్ఐఎ సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హైదరాబాద్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్, మణిపూర్‌లలో 100 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ నెల ప్రారంభంలో పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న 106 మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందనే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం బుధ‌వారంనాడు పీఎఫ్‌ఐపై ఐదేళ్ల పాటు నిషేధం విధించిన విష‌యం తెలిసిందే.

First Published:  28 Sep 2022 11:54 AM GMT
Next Story