Telugu Global
National

అన్నా డిఎంకెలో ముదిరిన ముస‌లం..ఉన్న ఒక్క ఎంపీని సాగ‌నంపారు

అన్నా డిఎంకెలో ముదిరిన ముస‌లం..ఉన్న ఒక్క ఎంపీని సాగ‌నంపారు
X

అన్నాడిఎంకెలో ముస‌లం మ‌రింత ముదురుతోంది. మాజీ ముఖ్య‌మంత్రి, ఆ పార్టీ మాజీ స‌మ‌న్వ‌య‌కర్త ప‌న్నీరు సెల్వం ను బ‌హిష్క‌రించిన తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప‌న్నీరు సెల్వం ఇద్ద‌రు కుమారుల‌తో పాటు పార్టీ కి చెందిన ఏకైక లోక్‌సభ ఎంపి పి.రవీంద్రనాథ్ ను పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం నుంచి బ‌హిష్క‌రించారు.

వీరితో పాటు మరో 16 మందిని కూడా పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. లోక్‌సభలో ఉన్న ఏకైక ఎంపీ పి. రవీంద్రనాథ్‌ కుమార్‌ బహిష్కరణతో అన్నాడీఎంకేకు దిగువ సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. బ‌హిష్కృతుల్లో పన్నీర్ సెల్వం కుమారుడు వి.పి. జయప్రదీప్, మాజీ మంత్రి వెల్లమండి ఎన్.నటరాజన్ ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యేలు వి.ఎన్.పి. వెంకట్రామన్, ఆర్.టి. రామచంద్రన్, ఎం.జి.ఎం. సుబ్రమణియన్, ఓంశక్తి శేఖర్, సైదాయి ఎం.ఎం. బాబు, మాజీ ఎంపీలు ఆర్.గోపాలకృష్ణన్, ఎస్.పి.ఎం. సయ్యద్ ఖాన్‌ను కూడా బహిష్కరించారు. ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధులు కోవై సెల్వరాజ్, మరుదు అళగురాజ్, కార్య కర్తలు ఎస్.ఎ.అశోకన్, అమ్మన్ పి.వైరముత్తు, డి.రమేష్, బి.వినుబాలన్, కొలత్తూరు డి.కృష్ణమూర్తి, ఎస్.ఆర్. అంజులక్ష్మిని కూడా బహిష్కరించారు. పార్టీ నియ‌మ నిబంధ‌నలకు, లక్ష్యాలకు విరుద్ధంగా వారి చ‌ర్య‌లు ఉన్నాయని పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో క్రమ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘించార‌ని పార్టీకి చెడ్డపేరు తెచ్చారని అందుకే వారిని బ‌హిష్క‌రించామ‌ని ఆయన అన్నారు.

First Published:  15 July 2022 6:18 AM GMT
Next Story