Telugu Global
National

500లకే గ్యాస్, రుణమాఫీ, ఫ్రీ పవర్ - రాహుల్ హామీల హోరు

పరివర్తన్ సంకల్ప యాత్రలో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ భారీ హామీలు ఇచ్చారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్న వేళ రాహుల్ హామీలు చర్చనీయాంశమయ్యాయి.

500లకే గ్యాస్, రుణమాఫీ, ఫ్రీ పవర్ - రాహుల్ హామీల హోరు
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీల జోరు పెంచారు. పరివర్తన్ సంకల్ప యాత్రలో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ భారీ హామీలు ఇచ్చారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్న వేళ రాహుల్ హామీలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే గుజరాత్‌లో ఆప్‌ తన ప్రత్యేకమైన హామీలతో దూసుకుపోతోంది. ఆప్‌ దెబ్బకే నరేంద్ర మోడీ ఇటీవల సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శ ఉంది.

ఇప్పుడు రాహుల్ గాంధీ భారీ హామీలు ఇచ్చారు. గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. మూడు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రూ.3 వేలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను ప్రారంభిస్తామని, అందులో బాలికలకు ఉచితంగా విద్య అందిస్తామని చెప్పారు. కోవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

300 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని మరో హామీ కూడా రాహుల్ ప్రకటించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.10 లక్షల మందికి గుజరాత్‌లో ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ ప్రకటించారు. నరేంద్ర మోడీపైనా రాహుల్ విరుచుకుపడ్డారు. మోడీ కేవలం కార్పొరేట్‌ శక్తులకు మాత్రమే రుణమాఫీ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేసినట్టు ఇప్పటి వరకు వినలేదన్నారు.

వల్లభాయ్‌ పటేల్‌ రైతు గొంతుక లాంటి వారని ఒక వైపు ఆయనకు పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి అదే సమయంలో రైతులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శించారు.

First Published:  5 Sep 2022 3:30 PM GMT
Next Story