Telugu Global
National

కేర‌ళ‌లో క్రిస్టియ‌న్ ఓట‌ర్ల‌పై బిజెపి వ‌ల‌..నేత‌ల‌కు త‌లంటిన మోడి!

ఎన్ని ప్రయత్నాలు చేసినా కేరళలో అడుగుపెట్టలేక పోతున్న బీజేపీ ప్రస్తుతం క్రైస్తవులపై వల విసిరేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాష్ట్ర నాయ‌క‌త్వానికి మొట్టికాయ‌లు వేసిన త‌ర్వాత రాష్ట్ర బిజెపి నాయ‌క‌త్వం గేమ్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది.

కేర‌ళ‌లో క్రిస్టియ‌న్ ఓట‌ర్ల‌పై బిజెపి వ‌ల‌..నేత‌ల‌కు త‌లంటిన మోడి!
X

ఇప్ప‌టికే వివిద రాష్ట్రాలో అధికారం కోసం వెంప‌ర్లాడుతూ అడ్డ‌దోవ‌లు తొక్కుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ కి కేర‌ళ కొర‌క‌రాని కొయ్య‌గా మారింది. అయిన‌ప్ప‌టికీ ఈడీ నోటీసులు,గ‌వ‌ర్న‌ర్ ద్వారా వామ‌ప‌క్ష ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల‌కు గురి చేసే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అక్క‌డి బిజెపి యూనిట్ ప‌ని తీరుపై బిజెపి అగ్ర నాయ‌క‌త్వం అసంతృప్తిగా ఉంది. ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాష్ట్ర నాయ‌క‌త్వానికి మొట్టికాయ‌లు వేసిన త‌ర్వాత రాష్ట్ర బిజెపి నాయ‌క‌త్వం గేమ్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా ప్ర‌ధానంగా క్రిస్టియ‌న్ ఓట‌ర్ల‌పై వ‌ల విసురుతూ వారిని ఆక‌ర్షించ‌డ‌మే ప్ర‌ధానంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల ద్వారా ఆ వ‌ర్గం ఓట‌ర్ల‌లో ల‌బ్ధిదారుల‌ను పెంచుకుంటూ పార్టీ పునాదిని బ‌ల‌ప‌ర్చుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

మ‌రో కొద్ది రోజుల్లో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంలో కేరళ యూనిట్‌లో సంస్థాగత మార్పులు చేప‌ట్ట‌నున్నారు. దీంతో పాత, కొత్త నాయ‌కుల‌కు ప‌ద‌వులు ల‌భించే అవ‌కాశాలు ఉన్నాయి. కొత్త‌గా ఏర్ప‌డే కార్య‌వ‌ర్గానికి రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతం చేసే బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని పార్టీ సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌లు చెప్పారు. ఇటీవ‌ల మోడీ నిర్వ‌హించిన స‌మావేశంలో రాష్ట నాయ‌క‌త్వంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని ఆ స‌మావేశంలో పాల్గొన్న‌ నాయ‌కుడు చెప్పారు. 2016 లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే స్థాయి నుంచి నేడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేక‌పోవ‌డాన్ని ఆయ‌న ఎత్తి చూపుతూ నాయ‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌.

కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కేరళలోని మైనారిటీ వర్గాలను, ప్రజలను ఆక‌ర్షించి ఎమ్మెల్యేల‌ను గెలిపించుకోవడంలో పార్టీ విఫలమైనందుకు మోదీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. క్రిస్టియన్ కమ్యూనిటీకి చేరువ కావాల్సిన అవసరాన్ని మోడీ నొక్కి చెప్పడం ఇదే తొలిసారి కాదు. జులైలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, హిందువేత‌ర వ‌ర్గాల‌ను కూడా చేరుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. "క్రైస్తవ సమాజ ప్రయోజనాలను కాపాడటానికి పార్టీ ప్రయత్నాలను హైలైట్ చేయడానికి" ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు కేరళను సందర్శించాలని కోరారు.

కొచ్చి సమావేశంలో మోడీ త‌లంటిన వారం తర్వాత, బిజెపి కేరళలో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను నియమించింది.

2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు 115 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ మొత్తం పోలైన ఓట్లలో 11.3 శాతం ఓట్లను సాధించింది, కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీనికి విరుద్ధంగా, పార్టీ 2016లో 98 స్థానాల్లో పోటీ చేసి, 10.53 శాతం ఓట్లను సాధించి, ఒక స్థానాన్ని గెలుచుకుంది. బీజేపీ అభ్యర్థులు ఏడు స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచారు.

రాష్ట్రంలోని కేంద్ర పథకాల లబ్ధిదారులకు చేరువ కావడంపైనే ప్రధాన మంత్రి మోడీ దృష్టి సారించారు. కేరళతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా "ఇటువంటి సమావేశాలకు ప్రధానమంత్రి హాజరవుతున్నారని, ఆయా యూనిట్ల పనితీరు గురించి ఆరా తీస్తున్నారని" కేరళ బీజేపీ చీఫ్ కె. సురేంద్రన్ చెప్పారు. బీజేపీ గెలిచే అవకాశం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లను గుర్తించాలని, అలాగే లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం కేరళ యూనిట్‌ను ఆదేశించింది.

"మేము లబ్ధిదారులకు మాత్రమే కాకుండా, అట్టడుగున ఉన్న వారితో సహా నిర్దిష్ట సమూహాలకు కూడా చేరువ కావాల‌నుకుంటున్నాము. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని క్రైస్తవులతో సహా మైనారిటీలతో పాటు స్థానికులందరినీ కలుస్తున్నాం అని సురేంద్ర‌న్ చెప్పారు.

కేరళ యూనిట్ రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల్లోకి ప్రవేశించాలని పార్టీ కేంద్ర నాయకత్వం కోరుకుంటోందని సీనియర్ బిజెపి కార్యకర్త అన్నారు. గోవాలో బిజెపికి క్రైస్తవుల మద్దతు ఉందని, ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని, కానీ కేరళలో అలా జరగలేదు" అని ఆయన అన్నారు.

Next Story