Telugu Global
National

చేతులు కాలాక ఆకులు.. కర్నాటకలో బుల్డోజర్లు

బెంగళూరు పరిధిలో 10కి పైగా చెరువులు ఆక్రమించి పూర్తిస్థాయిలో అక్కడ వెంచర్లు వేశారు. దాదాపు సగభాగం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం లగ్జరీ విల్లాలు, కాస్ట్ లీ ఏరియాల్లోని భవనాలన్నీ చెరువులు ఆక్రమించి కట్టినవే.

చేతులు కాలాక ఆకులు.. కర్నాటకలో బుల్డోజర్లు
X

కర్నాటక ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. అయితే ఇప్పుడైనా ప్రభుత్వం కఠినంగా ఉంటుందా, లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చేష్టలుడిగి చూస్తుందా అనేది తేలాల్సి ఉంది. భారీ వరదలకు బెంగళూరు నీటమునిగిన తర్వాత కర్నాటక సర్కారు నష్టనివారణ చర్యలు చేపట్టింది. బుల్డోజర్లతో ఆక్రమణలు తొలగిస్తోంది.

10కిపైగా చెరువుల ఆక్రమణ..

బెంగళూరు పరిధిలో 10కి పైగా చెరువులు ఆక్రమించి పూర్తి స్థాయిలో అక్కడ వెంచర్లు వేశారు. దాదాపు సగభాగం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం లగ్జరీ విల్లాలు, కాస్ట్ లీ ఏరియాల్లోని భవనాలన్నీ చెరువులు ఆక్రమించి కట్టినవే. ఈ ఆక్రమణలను తొలగించేందుకు ఈనెల 12నుంచి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 700 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. వీటిని సహించేది లేదంటూ తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. బెంగళూరు నగరంలోని అక్రమ కట్టడాలను నోయిడా ట్విన్ టవర్ల లాగా కూల్చేస్తామని హెచ్చరించారు. ఆయా కట్టడాలకు అనుమతించిన అధికారులు, బిల్డర్లు కూడా శిక్షార్హులేనని అన్నారు. ఆక్రమణలు పూర్తిస్థాయిలో తొలగించే వరకు ఈ డ్రైవ్‌ కొనసాగుతుందని చెప్పారు మంత్రి అశోక.

రాజకీయ ఒత్తిళ్లు..

ఇంత ఘోరం జరిగినా ఇంకా అక్కడ రాజకీయ ఒత్తిళ్లు మాత్రం ఆగలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బెంగళూరుకి మరోసారి వరదలు వస్తే ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశముంది. కానీ ప్రజలు అన్నీ మరచిపోయి తిరిగి అక్కడికే వచ్చేస్తారు, ఆ ప్రాంతాల్లోనే నివాసముంటారు, అక్కడే ప్లాట్లు కొంటారనే నమ్మకంతో.. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. అధికార బీజేపీ నుంచే రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ ఒత్తిళ్లు పెరిగాయి కాబట్టే మంత్రి అశోక అసెంబ్లీలో ఘాటుగా సమాధానమిచ్చారు. కానీ చివరకు ఏం జరుగుతుందోననే అనుమానం మాత్రం మిగిలే ఉంది. బొమ్మై కీలుబొమ్మే కాబట్టి.. ఈ కూల్చివేతలు ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదని అంటున్నారు. ఒకవేళ కూల్చివేతలకే ప్రభుత్వం సిద్ధమైతే వచ్చే ఎన్నికల్లో అది తీవ్ర ప్రభావం చూపిస్తుందనే భయం కూడా బీజేపీని వేధిస్తోంది.

First Published:  14 Sep 2022 2:40 AM GMT
Next Story