Telugu Global
National

ఆదిత్య ఎల్-1 ప్రయోగంలో కీలక ఘట్టం.. భూకక్ష్యను వదిలి సూర్యుని దిశగా..

భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్-1 దిశలో ఆదిత్య ఎల్-1 ప్రయాణం మొదలు పెట్టింది.

ఆదిత్య ఎల్-1 ప్రయోగంలో కీలక ఘట్టం.. భూకక్ష్యను వదిలి సూర్యుని దిశగా..
X

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సూర్యుడి రహస్యాలను పరిశోధించేందుకు గాను సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టారు. చంద్రయాన్-3 లాగానే.. దీన్ని కూడా స్లింగ్ షాట్ విధానంలో సూర్యుడి వైపుకు ప్రయోగించారు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ భూకక్ష్యంలో తిరుగుతూ.. కక్ష్యను పెంచుకుంటూ ఉన్నది. తాజాగా ఇస్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహా కక్ష్యను మరోసారి పెంచి సూర్యడి దిశగా విజయవంతంగా ప్రవేశపెట్టారు.

భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్-1 దిశలో ఆదిత్య ఎల్-1 ప్రయాణం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఉపగ్రహ వాహక నౌక లగ్రాంజ్ పాయింట్ 1 దిశగా దూసుకొని పోతోంది. పీఎస్ఎల్వీ సీ-57 వాహక నౌక ద్వారా ప్రయోగించిన ఈ ఉపగ్రహం.. భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టిన తర్వాత నాలుగు సార్లు కక్ష్యను పెంచారు. తాజాగా ఐదో సారి కక్ష్యను పెంచి లగ్రాంజ్ పాయింట్1 వైపు వెళ్లేలా దిశను మార్చారు. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం 110 రోజుల ప్రయాణం తర్వాత మరొక విన్యాసం చేపట్టి లగ్రాంజ్ పాయింట్-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఇస్రో ఇప్పటికే చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 22న ప్రగ్యాన్ రోవర్‌ను తిరిగి యాక్టివేట్ చేస్తారు. ఆ రోజు చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూర్యోదయం అవుతుంది. దాంతో మరోసారి సోలార్ ప్లేట్ల ద్వారా చార్జింగ్ అయ్యి రోవర్ యాక్టివేట్ అవుతుందని భావిస్తున్నారు. ఒక వేళ యాక్టివేట్ కాకపోతే.. చంద్రుడిపై శాశ్వత భారత అంబాసిడర్‌గా రోవర్, ల్యాండర్ అలాగే ఉండిపోతాయి.

ఇక భారత్ తరపున సూర్యుడి రహస్యాలను అధ్యయనం చేయడానికి తొలిసారిగా ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం.. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్-1మ చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు చేపట్టనున్నది. ఇది విజయవంతం అయితే ఇస్రో చరిత్రలో మరో మైలు రాయి దాటినట్లే.


First Published:  19 Sept 2023 12:15 AM GMT
Next Story