Telugu Global
National

అదానీ గాలి బుడగ పగిలి‍ంది....వారంరోజుల్లో 8.79 లక్షల కోట్ల సొమ్ము ఆవిరయ్యింది

గుజరాత్ లో మోడీ ముఖ్యమంత్రి కాక ముందు పెద్దగా ఎవరికీ తెలియని అదానీ అతి తక్కువ కాలంలో ప్రపంచ ధనవంతుల్లోనే 3వ స్థానానికి చేరుకోవడం, అంతే వేగంగా కిందికి దిగజారడం...దీన్నే ప్రతిపక్షాలు క్రోనీ కాప్టలిజం అంటున్నాయి. దీన్నే హిండెన్ బర్గ్ స్కాం అంది.

అదానీ గాలి బుడగ పగిలి‍ంది....వారంరోజుల్లో 8.79 లక్షల కోట్ల సొమ్ము ఆవిరయ్యింది
X

జనవరి 25 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు వారం రోజులు...అందులో మూడురోజులు స్టాక్ మార్కెట్ కు సెలవులు. మిగిలినవి 4 రోజులు. ఆ 4 రోజుల్లో అదానీ ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. 8.79 లక్షల కోట్ల సొమ్ము ఆవిరయిపోయింది. ప్రపంచ కుబేరుల్లో ఆయన 3వ స్థానం నుండి 17వ స్థానానికి పడిపోయారు.

గుజరాత్ లో మోడీ ముఖ్యమంత్రి కాక ముందు పెద్దగా ఎవరికీ తెలియని అదానీ అతి తక్కువ కాలంలో ప్రపంచ ధనవంతుల్లోనే 3వ స్థానానికి చేరుకోవడం, అంతే వేగంగా కిందికి దిగజారడం...దీన్నే ప్రతిపక్షాలు క్రోనీ కాప్టలిజం అంటున్నాయి. దీన్నే హిండెన్ బర్గ్ స్కాం అంది. అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన మదుపరులు లబోదిబోమంటున్నారు. సామాన్యుడు ఏమనాలో తెలియక దిక్కులు చూస్తున్నాడు.

వైకుంటపాళీలో మోడీ అనే నిచ్చెన ద్వారా పైకి ఎగబాకిన అదానీ కథ ఎప్పుడో మొదలైనా జనవరి 25న మాత్రం ఆయన హిండెన్ బర్గ్ అనే పాము నోట్లో పడ్డాడు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన పతనం ఇంకా ఆగలేదు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో కూడా ఇప్పుడే చెప్పలేం.

ఇక ఒక్క సారి జనవరి 25 నుండి జరిగినపరిణామాలు చూస్తే....

అదానీ కంపెనీల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచుతున్నారని, అదానీ కంపెనీల ఆకౌంట్లలోనే అవకతవకలున్నాయని జనవరి 25న న్యూయార్క్ కు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ రిపోర్ట్ విడుదల చేసింది.

హిండెన్ బర్గ్ రిపోర్ట్ లో అదానీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అనేక డొల్ల కంపెనీల ద్వారా ఎలా సంపదను పెంచుకున్నాయి. స్టాక్ మార్కెట్ల నిబందనలను ఎలా ఉల్లంఘించాయి. అదానీ అన్న మలేషియాలో 35 డొల్ల కంపెనీలు పెట్టి వాటి ద్వారా అదానీ కంపెనీలకు ఎలా నిధులుమళ్ళించాడు. ఇలాంటివి మొత్తం 45 ఆరోపణలు చేసింది హిడెన్ బర్గ్ సంస్థ. వాటి ఆధారంగా అదానీకి 88 ప్రశ్నలు స‍ంధించింది.

ఈ వివరాలు 25న హిండెన్ బర్గ్ విడుదల చేయగా ఆరోజు అదానీ గ్రూపుల షేర్లు దారుణంగా పతనమయ్యాయి. అదానీ గ్రూపు హిండెన్ బర్గ్ రిపోర్ట్ ను తప్పుపడుతూ ఓ ప్రకటన ఇచ్చింది. రిపోర్ట్ మొత్తం తప్పు అని చెప్తూనే భారత జాతీయత అనే ఆయుధాన్ని కూడా తన ప్రకటనలో ఇరికించారు. హిండెన్ బర్గ్ సంస్థపై కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. దానికి హిండెన్ బర్గ్ ఘాటుగానే సమాధానమిచ్చింది. మీరు కోర్టుకు వెళ్ళాలనే తాము కోరుకుంటున్నామని దానివల్ల తాము సంపాధించలేని పలు పత్రాలను మీరే స్వయంగా కోర్టుకు ఇవ్వాల్సి వస్తుందని దాని ద్వారా మరిన్ని విషయాలు బహిర్గతమవుతాయని ఆసంస్థ పేర్కొంది.

ఆ తర్వాత రోజు జ‌నవరి 26 సెలవు. 27న మళ్ళీ స్టాక్ మార్కెట్ లో అదానీ షేర్లు పతనమయ్యాయి. ఈ రె‍ండురోజుల షేర్ల పతనం వల్ల అదానీ కంపెనీల నెట్ వర్త్ లో 4 లక్షల కోట్ల రూపాయల పతనం జరిగింది.

30వ తేదీన‌ అదానీ గ్రూపు 413 పేజీలతో హిండెన్ బర్గ్ కు లేఖ రాసింది. దానికి హిండెన్ బర్గ్ 8 పేజీల ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూపు ఇచ్చిన 413 పేజీల లేఖ లో అన్నీ ఎందుకూ పనికి రాని విషయాలే అని హిండెన్ బర్గ్ పేర్కొంది.

హిండెన్ బర్గ్ సంధించిన 88 ప్రశ్నల్లో 26 ప్రశ్నలకు మాత్రమే జవాబు చెప్పింది అదానీ గ్రూపు.62 ప్రశ్నలను దాటవేసింది. ఆ 26 ప్రశ్నలకు కూడా దేనికి సూటిగా జవాబు ఇవ్వలేదు. పైగా గౌతమ్ అదానీ స్వంత అన్న, అదానీ కంపెనీల్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన‌ వినోద్ అదానీతో తనకే సంబంధమూ లేదని చెప్పారు అదానీ.

జనవరి 30వ తేదీ ఒక్క రోజే అదానీ షేర్లలో 1లక్షా 86 వేల కోట్ల పతనం జరిగింది. 31 వ తేదీన కూడా అదానీ కంపెనీల షేర్ల పతనం కొనసాగింది.

స్టాక్ మార్కెట్ల మీద, కంపెనీల మీద పరిశోధనలు చేసి ఆ కంపెనీల షేర్లకు, బాండ్లకు అసలు విలువ ఎంత అని ప్రకటించే 'క్రెడిట్ స్యూస్' అనే యూరప్ కు చెందిన కంపెనీ ఫిబ్ర‌వరి 1వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూపు బాండ్లకు ఉన్న విలువ జీరో అని ప్రకటించింది. ఈ బాండ్లను అనేక ప్రభుత్వ రంగ సంస్థలు వ్యక్తులు ఇప్పటికే లక్షలాదిగా కొని ఉన్నారు.మళ్ళీ ఫిబ్రవరి1, 2 తేదీల్లో పతన‍ం కొనసాగి మొత్తం 9 లక్షల కోట్ల రూపాయల ఆస్తి కోల్పోయింది అదానీ గ్రూపు.

అదానీ గ్రూపులోని ముఖ్యమైన కంపెనీల షేర్ల ధ‌ర‌లు జనవరి 24 నాడు ఎంత ఉన్నాయో, ఫిబ్రవరి 2వ తేదీకి ఎంతగా పడిపోయాయో ఒకసారి చూద్దాం.

అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ధ‌ర‌ జనవరి 24 న 3442. 75 ఉండగా ఫిబ్రవరి 2వ తేదీకి 1564.70కి పడిపోయింది.

అదానీ పోర్ట్స్ షేరు ధ‌ర‌ జనవరి 24 న 760.85 ఉండగా ఫిబ్రవరి 2వ తేదీకి 462.00 కి పడిపోయింది.

అదానీ పవర్ షేరు ధ‌ర‌ జనవరి 24 న 274.80 ఉండగా ఫిబ్రవరి 2వ తేదీకి 202.15 కి పడిపోయింది.

అదానీ ట్రాన్స్ మిషన్ షేరు ధ‌ర‌ జనవరి 24 న 2756.15 ఉండగా ఫిబ్రవరి 2వ తేదీకి 1557.25 కి పడిపోయింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ధ‌ర‌ జనవరి 24 న 1913.55 ఉండగా ఫిబ్రవరి 2వ తేదీకి 1038.05 కి పడిపోయింది.

అదానీ టోటల్ గ్యాస్ షేరు ధ‌ర‌ జనవరి 24 న 3885.45 ఉండగా ఫిబ్రవరి 2వ తేదీకి 1711.50 కి పడిపోయింది.

అదానీ విల్మర్ షేరు ధ‌ర‌ జనవరి 24 న 573.15 ఉండగా ఫిబ్రవరి 2వ తేదీకి 421.45 కి పడిపోయింది.

ఈ ఆస్తులన్నీ కృత్రిమంగా కాకుండా నిజంగానే సృష్టించినవైతే వారం రోజుల్లో ఇంతగా పతనమవుతాయా ? సంపద అంటే ప్రజలకు ఉపయోగపడేది కాకుండా కాగితాల మీద మాత్రమే ఉండేది అనుకున్నంత కాలం ఈ గాలి బుడగ అభివృద్ది జరుగుతూనే ఉంటుంది. ఆ గాలి బుడగలు పగిలిపోతూనే ఉంటాయి. ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపి, అక్రమంగా, నిబందనలు ఉల్లంఘించి, ప్రజల సొమ్ముతో తమ ఆస్తులు పెంచుకునే క్రోనీ కాప్టలిస్టుల వ్యవస్థ ఉన్నంత కాలం స్టాక్ మార్కెట్ ఒక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీయే.

First Published:  3 Feb 2023 6:46 AM GMT
Next Story