Telugu Global
National

అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేస్తున్న సంచలన నివేదిక

అదానీ గ్రూపులోని ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల ధర 85 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని కూడా ఈ రిపోర్ట్ హెచ్చరించింది. కేవలం మూడేళ్ల కాలంలోనే గ్రూప్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ సగటున 816 శాతం పెరగడంపై ఈ రిపోర్ట్ అనుమానాలను వ్యక్తం చేసింది.

అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేస్తున్న సంచలన నివేదిక
X

అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ విడుదల చేసిన సంచలన నివేదిక అదానీ గ్రూపును అతలాకుతలం చేస్తోంది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ షేర్ భారీగా పతనం అవుతోంది. అదానీ గ్రూపులో పెట్టుబడులు ఏ మాత్రం మంచిది కాదని రీసెర్చ్ తన నివేదికలో స్పష్టం చేసింది. దాంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి.

తన నివేదికలో అదానీ గ్రూప్ కంపెనీల ఆర్థిక సామర్థ్యంపై హిండెన్‌బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసింది. లెక్కల పుస్తకాలను మార్చడం, స్టాక్ మార్కెట్ మాయాజాలం ద్వారానే ఈ గ్రూప్ భారీగా అప్పులు తెస్తూ ముందుకు వెళ్తున్నట్టు రిపోర్ట్ చెబుతోంది. గ్రూపులోని ఏడు కంపెనీల షేర్ల ధరలను పెంచేందుకు అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని చెబుతోంది. షేర్ల ధరలను అమాంతం పెంచి, ఆ ధరకు షేర్లను తాకట్టు పెట్టి మరిన్ని అప్పులు తెస్తూ కంపెనీని నడుపుతున్నారని ఆరోపించింది.

అదానీ గ్రూపులోని ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల ధర 85 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని కూడా ఈ రిపోర్ట్ హెచ్చరించింది. కేవలం మూడేళ్ల కాలంలోనే గ్రూప్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ సగటున 816 శాతం పెరగడంపై ఈ రిపోర్ట్ అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ ర్యాలీ వెనుక ప్రమోటర్ల హస్తముందని ఆరోపించింది. అక్రమంగా షేర్ల ధరలను పెంచి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని కూడా రిపోర్ట్ వివరించింది. అదానీ గ్రూప్ ప్రస్తుత నెట్‌వర్త్ 12 వేల కోట్ల డాలర్లలో.. పదివేల కోట్ల డాలర్లు కేవలం ఈ మూడేళ్లలోనే సమకూరడంపైనా అనుమానం వ్యక్తం చేసింది రిపోర్ట్.

ప్రస్తుతం అదానీ కంపెనీల అప్పు రూ. 2.2 లక్షల కోట్లు ఉంది. ఇందులో 40% అప్పు ఒక ఏడాదిలోని పెరిగిన అంశాన్ని రిపోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. ఈ విషయాలన్నింటినీ గతంలో అదానీ కంపెనీలో పనిచేసిన మాజీ ఉన్నతోద్యోగుల నుంచి సేకరించినట్టు ఆ సంస్థ చెబుతోంది. ప్రమోటర్ల అవినీతి, అక్రమ నగదు లావాదేవీలు, లాభాల దారి మళ్లింపు వంటి అంశాలను కూడా అమెరికా సంస్థ తన నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ రిపోర్టు దెబ్బకు బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి.

ఈ రిపోర్టు దెబ్బకు షేర్లు మరింత పతనమవుతాయని భావించిన ఇన్వెస్టర్లు వాటిని తమ చేతుల్లో నుంచి దులుపుకునేందుకు ప్రయత్నించారు. ఒక్క బుధవారం రోజు అదానీ గ్రూప్ ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ ఏకంగా 55 వేల కోట్ల రూపాయల మేర ఆవిరైంది. ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడిగా తిరుగుతున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని విచారించే దమ్ము ఈడీ, సిబిఐ, ఐటి సంస్థలకు ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు.


హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ నివేదికను కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రిపోర్టుపై జాతీయ ప్రధాన మీడియా మాట్లాడదు.. చర్చలు కూడా నిర్వహించదని ఖచ్చితంగా తాను చెప్పగలనని, ఒకవేళ ఈ రిపోర్టును సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తే కేంద్ర ప్రభుత్వం వాటిని తొలగిస్తుందని కేటీఆర్ అన్నారు. అదానీ గ్రూప్‌ మాత్రం ఈ రిపోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 27న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 20వేల కోట్ల రూపాయల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఇష్యూ జారీ ఇష్యూ చేస్తున్న నేపథ్యంలో ఈ రిపోర్టును బహిర్గతం చేయడం వెనుక కుట్ర ఉందని ఆ కంపెనీ ఆరోపించింది. తమ షేర్ల ధరల పెరుగుదలకు, అప్పుల సేకరణకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఏ వ్యక్తి కూడా ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని ఆ కంపెనీ వాదిస్తోంది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థల నివేదికల ఆధారంగానే పెట్టుబడిదారులు తమ గ్రూపులో పెట్టుబడులు పెడుతుంటే అసలు వీళ్ళకేంటి బాధ అని అదానీ గ్రూప్ ప్రశ్నించింది.

First Published:  26 Jan 2023 5:19 AM GMT
Next Story