Telugu Global
National

అదానీ పతనం ఎంత వరకు..?

కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 4 లక్షల 17వేల కోట్ల రూపాయల మేర కోల్పోయింది. గ్రూపులోని పలు కంపెనీలు ఏకంగా 20 శాతం మేర పతనాన్ని నమోదు చేసుకున్నాయి.

అదానీ పతనం ఎంత వరకు..?
X

హిండెన్‌బర్గ్ నివేదిక దెబ్బకు బాణం తగిలిన పిట్టలాగా అదానీ కంపెనీల షేర్లు కూలిపోతున్నాయి. వరుసగా రెండో రోజూ అదానీగ్రూప్ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. రెండు రోజుల్లోనే ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ స్థానం నాలుగు నుంచి ఏడో స్థానానికి పడిపోయింది.

కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 4 లక్షల 17వేల కోట్ల రూపాయల మేర కోల్పోయింది. గ్రూపులోని పలు కంపెనీలు ఏకంగా 20 శాతం మేర పతనాన్ని నమోదు చేసుకున్నాయి. ఒక అదానీ గ్రూప్‌కే కాకుండా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, రుణాలు ఇచ్చిన బ్యాంకుల షేర్లు కూడా భారీగా పతనం అయ్యాయి.

గ్రూపులో పెట్టుబడి పెట్టిన ఎల్ఐసి రెండు రోజుల వ్యవధిలోనే 18 వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. అదానీ గ్రూప్ కంపెనీలో ఎల్ఐసి 81 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టింది. రుణాలు ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. శుక్రవారం సెన్సెక్స్ ఒక దశలో 1200 పాయింట్లు నష్టపోయింది. చివరకు 874 పాయింట్ల నష్టంతో ముగిసింది.

హిండెన్‌ బర్గ్ నివేదికలో వివరాల ఆధారంగా అదానీ సంస్థకు సెబీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అధికారికంగా మాత్రం నోటీసుల జారీని ధృవీకరించడం లేదు. రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్లో 10.73 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇందులో అదానీ సంస్థల వాటానే 4.17 లక్షల కోట్లుగా ఉంది. సెన్సెక్స్ మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.

అదానీ సంపద విలువ 100 బిలియన్ డాలర్ల దిగువకు వచ్చేసింది. హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్ పై అదానీ సంస్థ నుంచి వచ్చిన సమాధానం ఏమాత్రం సానుకూలంగా లేకపోవడంతోనే శుక్రవారం కూడా భారీ పతనం కొనసాగిందని భావిస్తున్నారు. నివేదిక లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా సాదాసీదాగా ఖండన ప్రకటన విడుదల చేయడం, న్యాయపరంగా ఎదుర్కొంటాం వంటి రోటీన్ ప్రకటన కారణంగానే ఇన్వెస్టర్లలో అదానీ సంస్థ విశ్వాసాన్ని నింపలేకపోయిందని భావిస్తున్నారు. ఇది వరకు కూడా అదానీ గ్రూప్‌పై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ సంస్థ పెరుగుదల ఒక గాలి బుడగ అన్న అభిప్రాయం బలపడింది. ఊహించని పరిణామాలు ఉంటే తప్పించి.. వచ్చే వారం కూడా అదానీ షేర్ల పతనం ఆగకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  28 Jan 2023 3:28 AM GMT
Next Story