Telugu Global
National

అది దేశంపై దాడి.. అదానీ వితండవాదం

అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ సంస్థ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని కొట్టిపారేస్తున్నారు. అక్కడితో ఆగితే బాగుండేది, కానీ ఆయన అది తన కంపెనీపై జరిగిన దాడి కాదని, దేశంపై జరిగిన దాడి అని అభివర్ణించడమే ఇక్కడ హైలెట్.

అది దేశంపై దాడి.. అదానీ వితండవాదం
X

అదానీ సంపద పెరిగితే, భారత సంపద పెరిగినట్టు ఎలా అవుతుంది. అదానీ పరువు పోతే భారత పరువు పజారునపడినట్టు ఎలా అవుతుంది..? అంటే తప్పు జరిగినా మన పరువు పోకూడదని అదానీకి అందరూ కొమ్ముకాయాలా..? అదానీ అంత సచ్ఛీలుడా, నీతిమంతుడా, లాభాపేక్ష లేకుండా వ్యాపారాలు చేస్తున్న సమాజ సేవకుడా..? వీటన్నిటికీ ఆయన అవుననే సమాధానం చెప్పుకుంటున్నారు. అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ సంస్థ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని కొట్టిపారేస్తున్నారు. అక్కడితో ఆగితే బాగుండేది, కానీ ఆయన అది తన కంపెనీపై జరిగిన దాడి కాదని, దేశంపై జరిగిన దాడి అని అభివర్ణించడమే ఇక్కడ హైలెట్.

413 పేజీల కవరింగ్ లెటర్

దేశాభివృద్ధికి పాటుపడుతున్న సంస్థలపై దురుద్దేశపూర్వకంగా హిండెన్ బర్గ్ దాడికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అదానీ. ఆ ఆరోపణలన్నీ అవాస్తవం అని అన్నారాయన. ఈ మేరకు 413 పేజీలతో కూడిన ఒక ప్రకటనను అదానీ విడుదల చేశారు. తప్పుడు ఆరోపణలతో తమ గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు పడగొట్టి.. హిండెన్‌ బర్గ్‌ సంస్థ షార్ట్‌ సెల్లింగ్‌ ద్వారా భారీగా లాభపడాలని చూస్తోందని ఆయన విమర్శించారు.

భారత్ పై దాడి..

ఆర్థిక లాభాలను పొందేందుకు వీలుగా దురుద్దేశంతో తప్పుడు మార్కెట్‌ ను సృష్టించడం కోసమే హిండెన్‌ బర్గ్‌ ఇలాంటి ఆరోపణలతో దాడికి తెగబడిందని అదానీ గ్రూప్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కేవలం గౌతమ్‌ అదానీ సంస్థలపై జరిగిన దాడి కాదని, దేశం, స్వాతంత్ర్యం, సమగ్రత, నాణ్యత, ఆర్ధిక వృద్ధిపై దాడి అని చెప్పింది. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ 20వేల కోట్ల రూపాయల సమీకరణకోసం ఈనెల 27న ఎఫ్‌పీఓ ప్రారంభించింది. ఈ ఇష్యూ ఫిబ్రవరి 1తో ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూని దెబ్బ కొట్టేందుకే హిండెన్‌ బర్గ్ ఆరోపణలు చేసినట్టు అనుమానిస్తోంది అదానీ గ్రూప్.

సమాధానాలు చెబుతారా..?

హిండెన్‌ బర్గ్‌ లేవనెత్తిన 88 ప్రశ్నలలో 65 ప్రశ్నలకు అదానీ గ్రూప్ తెలివిగా సమాధానమిచ్చింది. తమ కంపెనీ షేర్లలో పెట్టుబడులు అన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయని తెలిపింది. మిగతా 23లో 18 ప్రశ్నలు పబ్లిక్‌ షేర్‌ హోల్డర్లు, థర్డ్‌ పార్టీలకు సంబంధించినవని వెల్లడించింది. 5 ప్రశ్నలు నిరాధారమైనవని తెలిపింది. తమ కంపెనీలన్నీ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయని అదానీ గ్రూప్‌ స్పష్టం చేసింది. అదానీ వివరణ అంతా బాగానే ఉన్నా.. హిండెన్ బర్గ్ చేసిన దాడి అదానీ గ్రూప్ పై కాదు, భారత్ పై అంటూ వితండవాదం చేయడమే విమర్శలకు తావిస్తోంది.

First Published:  30 Jan 2023 3:43 AM GMT
Next Story