Telugu Global
National

అదానీ దెబ్బ.. డీవీఎస్‌ రాజుకు రూ.1350 కోట్ల నష్టం..

హిండెన్‌ బర్గ్ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత అదానీ పోర్టు షేర్ విలువ ఏకంగా రూ. 488లకు పడిపోయింది. ఒక్కో షేర్ మీద డీవీఎస్ రాజు రూ. 270 వరకు నష్టపోయారు.

అదానీ దెబ్బ.. డీవీఎస్‌ రాజుకు రూ.1350 కోట్ల నష్టం..
X

అదానీ గ్రూప్‌కు సహకరించిన, సాయం చేసిన, సహవాసం చేసిన అందరూ ఇప్పుడు కుప్పకూలిపోతున్నారు. ఇప్పటికే పలు బ్యాంకుల షేర్లు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ బాధితుల జాబితాలో డీవీఎస్ రాజు కూడా చేరారు. గంగవరం పోర్టులో వాటాను అదానీకి సమర్పించుకున్నందుకు డీవీఎస్‌ రాజు వందల కోట్లు నష్టపోతున్నారు.

గంగవరం పోర్టులో డీవీఎస్‌ రాజుకు 58.1 శాతం వాటా ఉండేది. ఈ పోర్టుపై కన్నేసిన అదానీ దాదాపు బలవంతంగానే డీవీఎస్‌ రాజు నుంచి వాటాను సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టులోని తన 10.39 శాతం వాటాను మారుమాట్లాడకుండా అదానీకి సమర్పించుకుంది. డీవీఎస్‌ రాజు తన వాటాను విక్రయించినందుకు అదానీ సంస్థ నేరుగా డబ్బు చెల్లించలేదు. గంగవరం పోర్టు వాటాను సమర్పించుకున్నందుకు గాను..అదానీ పోర్టు కంపెనీలో 5 కోట్ల షేర్లను ప్రతిఫలంగా ఇచ్చింది.

ఇలా షేర్లను ఇవ్వడంతో పాటు ఒక కండిషన్ కూడా పెట్టింది. రెండేళ్ల వరకు డీవీఎస్‌ రాజు తాము కేటాయించిన షేర్లను విక్రయించడానికి వీల్లేకుండా ఒప్పందంలో లాక్‌ పెట్టారు. ఇప్పటికి ఇంకా రెండేళ్లు కాలేదు. గంగవరం పోర్టులో వాటాను ఇచ్చి అదానీ పోర్టు షేర్లను తీసుకునేనాటికి అదానీ పోర్టు షేర్ విలువ 765 రూపాయలుగా ఉండేది. అ లెక్కన ఐదు కోట్ల షేర్లను కేటాయించారు.

హిండెన్‌ బర్గ్ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత అదానీ పోర్టు షేర్ విలువ ఏకంగా రూ. 488లకు పడిపోయింది. ఒక్కో షేర్ మీద డీవీఎస్ రాజు రూ. 270 వరకు నష్టపోయారు. ఈ లెక్కన అదానీ పతనం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు డీవీఎస్ రాజు దాదాపు రూ. 1350 కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. అదానీ పతనం ఇప్పట్లో ఆగే సూచనలూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అటు గంగవరం పోర్టు వాటాను పోగొట్టుకుని.. ఇటు పనికి రాకుండా పోతున్న అదానీ పోర్టు షేర్లను నెత్తినేసుకుని డీవీఎస్ రాజు భారీగానే నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

First Published:  4 Feb 2023 3:55 AM GMT
Next Story