Telugu Global
National

ఆరేళ్లుగా ఫలితం లేదు, అందుకే సరోగసీ..

సరోగసీ నిబంధనలను తాము ఉల్లంఘించలేదని, ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నామని, అయినా పిల్లలు పుట్టక పోవడంతో సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నామని చెబుతున్నారు నయనతార దంపతులు.

ఆరేళ్లుగా ఫలితం లేదు, అందుకే సరోగసీ..
X

సినీ తారల జీవితాలు, ప్రేమలు, పెళ్లిళ్లు, పిల్లలు, విడాకులు.. అన్నీ విచిత్రంగానే ఉంటాయి. తాజాగా నయనతార సరోగసీ ఎపిసోడ్ కూడా అలానే అనేక మలుపులు తిరుగుతోంది. నయనతార, విఘ్నేష్ కి ఈ ఏడాది జూన్-9న వివాహం అయింది. తాజాగా వారు తల్లిదండ్రులమయ్యామంటూ ప్రకటించారు. కవల పిల్లల ఫొటోలు బయటపెట్టారు. పెళ్లైన నెలల వ్యవధిలోనే ఇదెలా సాధ్యం అంటే సరోగసీ అన్నారు, అన్నారు కానీ నాలిక కరుచుకోవాల్సి వచ్చింది. సరోగసీ నియమ నిబంధనలు పాటించలేదని వారిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, మెడికల్‌ అడిషినల్‌ డైరెక్టర్‌ సారథ్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి నయనతార దంపతులు వివరాలు అందించారు. అసలు విషయం చెప్పారు.

ఆరేళ్ల క్రితమే పెళ్లి..

ఆరేళ్ల క్రితమే తాను విఘ్నేష్ ని పెళ్లి చేసుకున్నట్టు నయనతార ఆధారాలు చూపించింది. ఐదేళ్లయినా తమకు పిల్లలు పుట్టలేదని, మాతృత్వం కోసం తాము అనేక ప్రయ‌త్నాలు చేశామని, ఆస్పత్రుల చుట్టూ తిరిగామని కూడా వివరాలు చూపించారు నయన్, విఘ్నేష్ దంపతులు. ఆ తర్వాత చివరి ప్రయత్నంగా డిసెంబర్ లో సరోగసీకి అప్ల‌య్‌ చేశామని తెలిపారు.

చట్టం ఏం చెబుతోంది.. ?

సరోగసీ విధానం ద్వారా తల్లిదండ్రులు కావాలంటే వివాహమై ఐదేళ్ళు పూర్తి కావాలి. భార్య వయస్సు 25 నుంచి 50 ఏళ్ళలోపు, భర్త వయస్సు 26 నుంచి 55 ఏళ్ళలోపు ఉండాలి. ఐదేళ్లుగా పిల్లలు లేని దంపతులే సరోగసీ ద్వారా పిల్లల్ని కనేందుకు అర్హులు. అలా నయనతార ఆ అర్హత తమకు ఉందని చెప్పేశారు. ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్‌ వివాహం చేసుకున్నామని సాక్ష్యాధారాలు బయటపెట్టింది నయనతార. ఇంకేముంది ఈ కేసు ఇక్కడితో క్లోజ్.

నయనతారకు గతంలో రెండు ఫెయిల్యూర్ లవ్ స్టోరీలున్నాయి. ప్రభుదేవాతో పెళ్లి ఖాయమైంది అనుకున్న తర్వాత బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఆమె దర్శకుడు విఘ్నేష్ కి దగ్గరైంది. 2015లో వీరిద్దరూ కలసి ఓ సినిమా చేశారు, అప్పట్లోనే వీరిమధ్య ప్రేమ చిగురించింది. అయితే ఆ తర్వాత పెళ్లికోసం ఏడేళ్లు వేచి చూశారు. చివరకు ఈ ఏడాది జూన్-9న వివాహం చేసుకున్నారు. కానీ సరోగసీ వివాదంతో తమకు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయిందని చెప్పింది నయనతార. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి, ఈ విషయంలో ఇక అధికారులు కూడా పెద్దగా జోక్యం చేసుకోకపోవచ్చు. సో.. నయనతార సరోగసీ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పడినట్టే.

First Published:  16 Oct 2022 3:36 AM GMT
Next Story