Telugu Global
National

మీలా.. మేం సురక్షితంగా లేం.. అధికారులపై హీరో విశాల్ అసహనం

ఇప్పుడు కూడా మేము వరద బాధితులకు ఆహారం, నీటిని సరఫరా చేసి ఆదుకుంటాం. ప్రజా ప్రతినిధులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో బయటకు వచ్చి బాధితులకు అండగా నిలబడతారని నేను భావిస్తున్నా.

మీలా.. మేం సురక్షితంగా లేం.. అధికారులపై హీరో విశాల్ అసహనం
X

మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చెన్నై నగరాన్ని వరద ముంచెత్తింది. నగరంలోని వీధులు నదుల్లా కనిపిస్తున్నాయి. రోడ్లపై ఉన్న కార్లన్నీ కొట్టుకుపోయాయి. చెన్నై అంతా అంధకారంలో చిక్కుకుపోయింది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితులపై హీరో విశాల్ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.

2015లో చెన్నై నగరంలో వరదలు వచ్చి ప్రజలు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని.. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొనడంపై ఆయన విమర్శలు చేశారు. వరద ఇంత ముంచెత్తినా మీరు సురక్షితంగా ఉన్నారనే నేను భావిస్తున్నాను.. కానీ, మేము మాత్రం సురక్షితంగా లేము. మమ్మల్ని కాస్త పట్టించుకోండి.. అంటూ హీరో విశాల్ అధికారుల‌ను కోరారు.


'డ్రైనేజీ నీరు మీ ఇళ్లలోకి రాలేదు అనుకుంటా.. కరెంటు, ఆహారం మంచినీరు మీకు సక్రమంగా అందుతోందని భావిస్తున్నా.. అయితే నగరంలో మీతో పాటు నివసిస్తున్న మేము మీలా సురక్షితంగా లేము. మీరు చేపట్టిన స్మార్ట్ వాటర్ డ్రైన్ ప్రాజెక్ట్ సింగపూర్ కోసమా? లేక చెన్నై కోసం ఉద్దేశించిందా..? 2015లో కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం మునిగిపోయింది. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. మేం వారికి సాయం అందించాం. అయితే ఇది జరిగి 8 సంవత్సరాలు అయింది. అయినా అప్పటినుంచి ఇప్పటివరకు నగర పరిస్థితి మారలేదు. అంతకంటే అధ్వానమైన పరిస్థితి నెలకొంది.

ఇప్పుడు కూడా మేము వరద బాధితులకు ఆహారం, నీటిని సరఫరా చేసి ఆదుకుంటాం. ప్రజా ప్రతినిధులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో బయటకు వచ్చి బాధితులకు అండగా నిలబడతారని నేను భావిస్తున్నా. ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. మీరేదో అద్భుతాలు సృష్టిస్తారని ఆశపడటం లేదు. కనీసం మీ బాధ్యతను నిర్వర్తిస్తే చాలు' అంటూ అధికారులను విమర్శిస్తూ విశాల్ వీడియో విడుదల చేశారు. వీడియోలో పరోక్షంగా డీఎంకే ప్రభుత్వం తీరుపై ఆయన విమర్శలు చేసినట్లు అర్థమవుతోంది.

First Published:  5 Dec 2023 8:32 AM GMT
Next Story