Telugu Global
National

భారత్‌లో భారీగా పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్..

2040 వరకు భారత్ లో ఏడాదికి 7 శాతం చొప్పున ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుందని బోయింగ్ సంస్థ నివేదిక బయటపెట్టింది. ఇంతకంటే ఎక్కువ పెరుగుదల ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు బోయింగ్ సంస్థ ఎండీ డేవిడ్ షుల్టర్.

భారత్‌లో భారీగా పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్..
X

భారత్‌లో విమాన ప్రయాణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనాకు ముందు ఏ స్థాయిలో ప్రయాణాలు చేశారో ఇప్పుడు కూడా అదేస్థాయిలో ఫ్లైటెక్కుతున్నారు. నెలకు కోటిమంది దేశీయంగా విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇక విదేశీ యానం చేసేవారి సంఖ్య నెలకు 18.46 లక్షలకు చేరుకుంది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లోనే విమానయానం అధికం అని సర్వేలు చెబుతున్నాయి. 2040 వరకు భారత్ లో ఏడాదికి 7 శాతం చొప్పున ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుందని బోయింగ్ సంస్థ నివేదిక బయటపెట్టింది. ఇంతకంటే ఎక్కువ పెరుగుదల ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు బోయింగ్ సంస్థ ఎండీ డేవిడ్ షుల్టర్.

ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదల 5.5 శాతంగా ఉంటుందని బోయింగ్ సర్వే తేల్చింది. చైనా, ఆఫ్రికా దేశాల్లో 5.4 శాతం, లాటిన్ అమెరికా దేశాల్లో 4.8 శాతం ఈ పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. భారత్ లో మాత్రం 7 శాతానికంటే తగ్గేదే లేదని అంచనా వేస్తున్నారు. భారత్ లో జీడీపీ తగ్గుతున్నా.. ఎగువ మధ్యతరగతి వర్గంలో పెరుగుదల ఉందని, కరోనా తర్వాత సౌకర్యాల కోసం ప్రజలు చేస్తున్న ఖర్చు కూడా పెరిగిందని, అందుకే విమాన ప్రయాణాలు పెరుగుతాయని చెబుతున్నారు.

సరుకుల రవాణా కూడా అధికం..

కరోనా కష్టకాలంలో సరుకు రవాణాకు కూడా విమానరంగం బాగా ఉపయోగపడింది. సహజంగా సముద్ర మార్గం ద్వారా సరుకు రవాణా తక్కువ ఖర్చుతో కూడుకున్నదైనా కరోనా సమయంలో వైరస్ వ్యాప్తి దృష్ట్యా సముద్ర మార్గం ద్వారా ఎగుమతులు, దిగుమతులు కొన్నాళ్లపాటు ఆగిపోయాయి. ఆ దశలో విమానాల ద్వారా కార్గో రవాణాకి ఊతం లభించింది. ప్రస్తుతం ప్రయాణికుల సర్వీసులతోపాటు, సరుకు రవాణా చేసే కార్గో విమాన సర్వీసులు కూడా భారత్ లో భారీగా పెరిగాయి. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ముడి సరుకు పరిమాణం కూడా వృద్ధి చెందిందని అంటున్నారు బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే.

First Published:  2 Sep 2022 11:58 AM GMT
Next Story